
వైద్య విద్య ప్రైవేటీకరణపై ‘విదసం’ నిరసన
సీతంపేట: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలోకి మార్చడం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను వైద్య విద్యకు దూరం చేయడమేనని విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక (విదసం) కన్వీనర్ డాక్టర్ బూసి వెంకటరావు విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం అంబేడ్కర్ భవన్‌లో విదసం సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ వెంకటరావు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మెడికల్ సీట్ల రిజర్వేషన్‌లో 50 శాతం కోత పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన 2,400 సీట్లలో కేవలం 1,200 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటా కింద ఉంటాయని, మిగిలిన సీట్లను ప్రైవేట్ యాజమాన్యాలు కోట్లకు అమ్ముకునే అవకాశం కల్పించారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు అంతకంటే ప్రమాదకరమైన పీపీపీ విధానాన్ని తీసుకొచ్చి మొత్తం 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించడం దారుణమని ఆయన ప్రశ్నించారు. ఈ విధానం వల్ల తెల్ల రేషన్ కార్డులు లేని పేద విద్యార్థులు కన్వీనర్ కోటాలో సీటు పొందినా ఏటా రూ.12 నుంచి రూ.15 లక్షలు చెల్లించాల్సి వస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ పీపీపీ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. కార్యక్రమంలో విదసం ప్రతినిధులు జాజి ఓంకార్, సోడదాసి సుధాకర్, బూల భాస్కరరావు, గుడివాడ ప్రసాద్, మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.