
మేలైన యాజమాన్యంతో పసుపులో అధిక దిగుబడి
● ప్రాంతీయ ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు
చింతపల్లి: గిరి రైతులు పసుపు సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని స్థానిక ప్రాంతీయ ఉద్యానవన పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త శెట్టి బిందు అన్నారు. గురువారం జాతీయ పసుపు బోర్డు సౌజన్యంతో స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో రైతులకు పసుపులో నాణ్యత మెరుగుపై నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో ఆమె పలు సూచనలు చేశారు. స్పైసెస్ బోర్డు సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ బొడ్డు కల్యాణి సేంద్రియ సాగుకు ధ్రువపత్రం పొందే విధానం, 50 శాతం రాయితీపై అందజేసే యంత్రాల వివరాలను తెలిపారు. స్థానిక ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్త జోగారావు భూసార పరిరక్షణ ప్రాముఖ్యతలను వివరించారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్టు సబ్జెక్టు ఎక్స్‌పర్ట్ అప్పలరాజు, కోఆర్డినేటర్ వాసు పాల్గొన్నారు.