● రైతు వ్యతిరేక చర్యలపై
నిరసన, ఆందోళన రేపు
● అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: కూటమి ప్రభుత్వంలో రైతాంగానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. గురువారం తన క్యాంప్ కార్యలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈనెల 6వ తేదీన జిల్లా, డివిజన్ కేంద్రాల్లో రైతులతో నిర్వహించే ఆందోళనలో నియోజకవర్గంలోని రైతులంతా పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతీ రైతుకు అన్నదాత సుఖీభవ పేరిట రూ.20 వేలు పెట్టుబడి సాయం అందిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత నిలబెట్టుకోలేదన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో ఎరువులు పంపిణీ చేసిందన్నారు. వీటిని రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం రైతులకు ఎరువులు అందించడంలో విఫలమైందన్నారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో వరి, ఇతర పంటలు వేసుకున్న రైతులకు రాయితీపై యూరియా, డీఏపీ, ఇతర ఎరువులను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వచ్చిందన్నారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామూర్తి, ఎంపీటీసీ సమర్ధి శత్రుఘ్న, ఎస్టీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జన్ని నర్సింహమూర్తి, పార్టీ మండల ఉపాధ్యక్షులు పల్టాసింగ్ విజయ్ కుమార్, గుడివాడ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.