స్నేహితుల ఔదార్యం
చింతూరు: క్రికెట్ టోర్నమెంటు ద్వారా తమకు వచ్చిన రూ.70 వేల ప్రైజ్‌మనీని ప్రమాదంలో మృతిచెందిన స్నేహితుడి కుటుంబానికి అందించి స్నేహితులు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండలం కుమ్మూరులో నిర్వహించిన మెగా క్రికెట్ టోర్నమెంటులో చింతూరు యువత(యునైటెడ్ ఫ్రెండ్స్ చింతూరు) జట్టు విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు కూనవరం మండలం ఆర్కూరు జట్టును 61 పరుగులతో ఓడించి విజేతగా నిలిచి రూ 70.వేల నగదు బహుమతిని గెలుచుకుంది.
స్నేహితుడి పట్ల ఔదార్యం
చింతూరు యువత జట్టు సభ్యుడైన చింతూరు శబరిఒడ్డుకు చెందిన నాగుల దిలీప్‌కుమార్(25) ఇటీవల ప్రమాదవశాత్తు సీలేరు నదిలో పడి మృతిచెందాడు. తమ టీం సభ్యుడైన దిలీప్ అకాలమృతి తమను ఎంతో కలచివేసిందని, ఈ మేరకు క్రికెట్ టోర్నీలో విజయం సాధించి ఆ విజయాన్ని తమ స్నేహితుడికి అంకితమివ్వాలని భావించినట్లు యూత్ సభ్యులు తెలిపారు. దీంతో తమ జట్టుకు ప్రైజ్‌మనీగా వచ్చిన రూ.70 వేలతో పాటు కప్‌ను మృతుడు దిలీప్ కుటుంబ సభ్యులకు వారు అందజేశారు. కెప్టెన్ ఎస్.డి.షాహిద్, టీమ్ సభ్యులు దుర్గా, హరి, రాము, సాయి, గణేష్, గని, స్టీఫెన్, బిట్టు, దిలీప్, మహేష్ తదితరులు పాల్గొన్నారు


