
వీడిన గిరిజనుడి అదృశ్యం కేసు మిస్టరీ
డుంబ్రిగుడ: గిరిజనుడి అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి ఎస్‌ఐ పాపినాయుడు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గసభ పంచాయతీ లోగిలి గ్రామానికి చెందిన కొర్రా నాగేశ్వరరావు (38) అనే గిరిజనుడు ఈనెల ఒకటో తేదీన పంతలచింతలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఆ తరువాత అతని ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు ఈనెల 2న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనిలో భాగంగా నాగేశ్వరరావు సెల్‌ఫోన్ ఆధారంగా లొకేషన్ కురిడిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్నట్టుగా గుర్తించారు. ఈ మేరకు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించగా దుర్వాసనతో నాగేశ్వరరావు మృతదేహం వెలుగుచూసిందని, అదే ప్రాంతంలోని తుప్పల్లో అతని బైక్‌ను గుర్తించామని ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అరకు ఏరియా ఆస్పత్రికి తరలించామని ఆయన చెప్పారు. చెట్టును బైక్‌తో ఢీకొని ప్రమాదానికి గురై మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించామని ఎస్‌ఐ వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
బంధువుల ఇంటికి వెళ్లిన వ్యక్తి
కనిపించకపోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు
అతని సెల్‌ఫోన్ ఆధారంగా లొకేషన్ గుర్తింపు
కురిడి రైల్వే ట్రాక్ సమీపంలో
మృతదేహం, బైక్ లభ్యం
బైక్‌తో చెట్టును ఢీకొని
మృతి చెందినట్టుగా పోలీసులు వెల్లడి

వీడిన గిరిజనుడి అదృశ్యం కేసు మిస్టరీ