
కొంతిలిలో పశువుల వ్యాపారి ఆత్మహత్య
హుకుంపేట : చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ సురేష్‌కుమార్ తెలిపిన వివరాలివి. కొంతిలి గ్రామం సమీపంలో శుక్ర వారం ఉదయం ఓ చెట్టు వద్ద ఉరితాడుతో మృతదేహం వేలాడి ఉండగా స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడిని కొంతిలి గ్రామానికి చెందిన కొర్ర ప్రవీణ్ (30)గా గుర్తించారు. ప్రవీణ్ మూడు రోజుల నుంచి ఇంటికి రాలేదని, ఎన్నిసార్లు ఫోన్ చేసినా సమాధానం లేకపోగా, శుక్రవారం చెట్టుకు ఉరిపోసుకుని కనిపించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రవీణ్ గతంలో పశువుల వ్యాపారం చేసేవాడని, ఇటీవల కాలంలో అప్పులు పెరగడంతో అప్పుల వాళ్ల ఒత్తిడి పెరిగిందని, దీంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపారని ఎస్‌ఐ పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.