
పునరావాస కాలనీల నిర్మాణానికి భూ పరిశీలన
రంపచోడవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురవుతున్న చింతూరు డివిజన్‌లోని 41.15 కాంటూరు ఫేజ్ 1బీలోని 32 గ్రామాలకు పునరావాస కాలనీల నిర్మాణానికి భూమిని గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశామని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అభిషేక్ తెలిపారు. విలీన మండలాల నిర్వాసితులకు భూమికి భూమి, ఆర్‌అండ్‌ఆర్ కాలనీల నిర్మాణానికి భూసేకరణ కోసం ధవళేశ్వరం ప్రాజెక్టు ఆడ్మినిస్ట్రేటర్, పీఐపీ, చింతూరు పీవో, భూసేకరణ ప్రత్యేక కలెక్టర్ గత రెండు రోజులుగా రంపచోడవరం డివిజన్‌లో రెండురోజులుగా విస్తృతంగా పర్యటించారు. దీనిలో భాగంగా రంపచోడవరం, అడ్డతీగల, రాజవొమ్మంగి, గంగవరం మండలాల్లో భూ రికార్డులను పరిశీలించారు. ఇప్పటి వరకు దాదాపు 4,049 ఎకరాలను గుర్తించారు. రాజవొమ్మంగి మండలంలోని రెండు వేల ఎకరాల్లో 1400 ఎకరాలు రెండు సీజన్ల వ్యవసాయానికి, మిగతా 600 ఎకరాలు ఆర్‌అండ్‌ఆర్ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నట్టు గుర్తించారు. అలాగే గంగవరం మండలంలో 800 ఎకరాలు, అడ్డతీగలలో 1049 ఎకరాలు గుర్తించారు. ఈ నాలుగు మండలాల్లో సర్వే నంబర్లు ప్రకారం తహసీల్దార్ల సహకారంతో భూములను పరిశీలించారు. స్పెషల్ సబ్ కలెక్టర్లు బాలకృష్ణారెడ్డి, నజరియా, అంజనేయులు తదితరులు ఉన్నారు.