
గంజాయి కేసుల్లో నిందితులను త్వరగా అరెస్ట్ చేయాలి
పాడేరు : గంజాయి కేసుల్లో నిందితులుగా ఉండి తప్పించుకు తిరుగుతున్న వారిని త్వరగా అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించాలని జిల్లా ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణాపై నిత్యం డ్రోన్లతో నిఘా ఉంచాలని అన్నారు. వివిధ కేసుల నిమిత్తం ఫిర్యాదు చేసేందుకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల ప్రతి పోలీసు మర్యాదగా మెలిగి వారికి తగిన భరోసా కల్పించాలని, అన్ని రకాల పెండింగ్ కేసులను త్వరగా దర్యాప్తు నిర్వహించి కోర్టులో ఫైల్ చేయాలని సూచించారు. గ్రామాల్లో, విద్యా సంస్థల్లో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ముఖ్యమైన కూడళ్ల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, నేరాల నిరోధానికి క్రైం టీం నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పక్కా రాష్ట్రాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీస్‌స్టేషన్లలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పర్యటనల సందర్భంగా రోడ్లు, కల్వర్టుల్లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీంలతో విస్తృతంగా తనిఖీలు చేపట్టాలన్నారు. మావోయిస్టులు, మిలీషియా సభ్యులు ఎక్కువ మంది లొంగుబాటు నేపథ్యంలో ఇంకా ఎవరైనా లొంగిపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రోత్సాహకాలు, సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉత్తమ సేవలు అందించిన ఎనిమిది మంది పోలీస్ సిబ్బందికి నగదు రివార్డుతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ధీరజ్, చింతపల్లి, చింతూరు ఏఎస్పీలు నవజ్యోతిమిశ్రా, పంకజ్‌కుమార్ మీనా, పాడేరు, రంపచోడవరం డీఎస్పీలు ఎస్‌కే సహాబాజ్ అహ్మద్, జి. సాయిప్రశాంత్, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ సంజీవరావు, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ బి. అప్పలనాయుడు, జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
కూడళ్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి
సైబర్ నేరాలు, మత్తు పదార్థాల
వినియోగంపై అవగాహన కల్పించాలి
నేర సమీక్షలో అధికారులకు
ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశం