
థిన్నింగ్ పనులు కీలకం
రాజవొమ్మంగి : టేకు వనాల పెంపకంలో థిన్నింగ్ పనులు కీలకం అని డీఎఫ్‌వో రవీంద్ర ధానా అన్నారు. బుధవారం ఆయన స్థానిక అటవీక్షేత్రంలోని మర్రివీడు తిమ్మాపురం, చెరకుంపాలెం టేకు ప్లాంటేషన్, జడ్డంగి, సూరంపాలెం బీట్లలోని టేకు ప్లాంటేషన్లను పరిశీలించి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సాధారణంగా హెక్టారు నేలలో 625 టేకు మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఆ తరువాత 5 నుంచి 7 సంవత్సరాల తరువాత ఆ మొక్కల సాంద్రతను క్రమేపి తగ్గించాలన్నారు. చివరికి హెక్టారు నేలలో కేవలం 150 మొక్కలు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనివల్ల పెరిగే మొక్కలకు గాలి, వెలుతురు, అవసరమైన నీరు అందుతుందన్నారు. ఆరోగ్యవంతమైన టేకు ప్లాంటేషన్ తయారు చేయడంలో థిన్నింగ్ అతి ప్రధానమైనదని ఆయన పేర్కొన్నారు. టేకు వనాల్లో మొక్కలు అక్రమార్కుల పాలుకాకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని సూచించారు. విధినిర్వహణలో అలసత్వం వద్దని కోరారు. ఆయన వెంట సబ్ డీఎఫ్‌వో సుబ్బారెడ్డి, రాజవొమ్మంగి ఎఫ్‌ఆర్వో ఉషారాణి, ఎఫ్‌ఎస్‌వోలు, ఎఫ్‌బీవోలు పాల్గొన్నారు.