
బుడ్డపనసలో ప్రత్యేక వైద్య శిబిరం
ముంచంగిపుట్టు: మండలంలోని రంగబయలు పంచాయతీ బుడ్డపనస గ్రామంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జమాల్‌బాషా ఆదేశాల మేరకు శుక్రవారం లబ్బూరు వైద్యాధికారి శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. కాలినడకన అతి కష్టం మీద కొండలు, గుట్టలు ఎక్కి వైద్యాధికారి, వైద్య సిబ్బంది, 104 సిబ్బంది బుడ్డపనస చేరుకొని వైద్య శిబిరం నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో జ్వరం, జలుబు, దగ్గు,చర్మ వ్యాధులతో బాధపడుతున్న 45 మందికి వైద్య సేవలు అందించారు. మందులు పంపిణీ చేశారు. తీవ్రమైన జ్వరంతో పరిస్థితి విషమంగా ఉన్న ఐదుగురు చిన్నారులను మెరుగైన వైద్య సేవల నిమిత్తం ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలించారు. వైద్య శిబిరాన్ని వైస్ ఎంపీపీ భాగ్యవతి పరిశీలించారు. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.అనారోగ్య బారిన పడిన వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించి, వైద్యం పోందాలని, ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, నిల్వ ఉండే ఆహారం తినకూడదని, చిన్నారులకు ఎప్పటికప్పుడు వండిన ఆహారాన్ని మాత్రమే పెట్టాలని వైద్యాధికారి శ్యాంప్రసాద్ గ్రామస్తులకు సూచించారు. హెచ్‌వి భాగ్యవతి, లబ్బూరు వైద్య సిబ్బంది, 104 వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
45 మందికి వైద్య సేవలు
అయిదుగురు చిన్నారులకు
ముంచంగిపుట్టు సీహెచ్‌సీకి తరలింపు

బుడ్డపనసలో ప్రత్యేక వైద్య శిబిరం