
ఈదురుగాలులు... భారీ వర్షం
రంపచోడవరం: మండల కేంద్రం రంపచోడవరంలో గాలిదూమరంతో భారీ ఎత్తున వడగళ్ల వర్షం కురిసింది. ఈదురు గాలులు వీయడంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి విద్యుత్ సరఫరాను నిలిచిపోయింది. ఆదివారం జరిగిన సంతకు వచ్చిన పలువురు ఇబ్బందులకు గురయ్యారు. సుమారు రెండు గంటల పాటు వర్షం కురవడంతో రంపచోడవరం వీధులు నీటితో నిండిపోయాయి.
జి.మాడుగుల: మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలతో కుండపోతగా వర్షం కురిసింది. రోడ్లు జలమయమయ్యాయి. పాడేరు,చింతపల్లి,సొలభం, గడుతూరు, నుర్ముతి,మద్దిగరువు, బొయితిలి, లువ్వాసింగి, వంజరి, గెమ్మెలి కుంబిడిసింగి రోడ్లలో రాకపోకలు సాగించే ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భీకర శబ్దాలతో పిడుగులు పడడంతో భయాందోళనలకు గురయ్యారు.
రాజవొమ్మంగి : మండలంలో ఆదివారం భారీగా ఈదురు గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులు రావడంతో స్థానికులను భయాందోళనలకు గురయ్యారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మండలంలోని కొన్ని లోతట్టు గ్రామాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.
కొయ్యూరు: మండలంలో రోజూ సాయంత్రం ఈదురు గాలులు వీస్తుండడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తోంది. వారం నుంచి మండలంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఆదివారం సాయంత్రం కూడా ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. అటు కృష్ణదేవిపేట లైన్‌తో పాటు ఇటు రంపచోడవరం నుంచి వచ్చే విద్యుత్‌లైన్‌లో సాంకేతిక సమస్య వల్ల సరఫరా నిలిచిపోయింది.కొమ్మికలో శనివారం ఈదురుగాలులు మూలంగా పడిపోయిన స్తంభాలను ఆదివారం మధ్యాహ్నం పునరుద్ధరించారు.

ఈదురుగాలులు... భారీ వర్షం