కూనవరం: బతుకు దెరువు కోసం వచ్చిన వలస కూలీ పనులు ముగించుకొని స్వగ్రామం తిరిగి వెళుతూ కోతులగుట్ట, పంద్రాజుపల్లి మధ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎస్సై లతశ్రీ కథనం ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బైనాపల్లి గ్రామానికి చెందిన వలస కూలీ ముచ్చిక యర్రా (38) సరిహద్దు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా కూనవరం మండలం పోచవరం గ్రామంలో ఓ రైతు వద్దకు కూలి పనులకు వచ్చాడు. పనులు ముగియడంతో లెక్కలు చూసుకొని స్వగ్రామానికి గురువారం తిరుగు ప్రయాణం అయ్యాడు. ఏపీ సరిహద్దు గ్రామం చిడుమూరు వరకు ట్రాక్టర్‌పై వెళుతుండగా కోతులగుట్ట, పంద్రాజుపల్లి మధ్యలో ట్రాక్టర్ టైరు పేలింది. డ్రైవర్ పక్కనున్న యర్రా భయపడి కిందికి దూకేశాడు. ఆ క్రమంలో వెనుక వస్తున్న ట్రక్ కింద పడి మృతి చెందాడని ఎస్సై తెలిపారు. స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని బంధువులకు అప్పగించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు.