సీలేరు: బలిమెల జలాశయం నీటి వినియోగంపై గురువారం చిత్రకొండలో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశం నిర్వహించారు. 2024–2025 నీటి సంవత్సరంలో ఎంతెంత నీటిని వినియోగించుకున్నారో లెక్కలు కట్టారు. దీని ప్రకారం జూలై 2024 నుంచి ఫిబ్రవరి 2025 వరకు ఒడిశా తన వాటాగా 68.8672 టీఎంసీలు వినియోగించుకున్నట్లు, ఆంధ్రా 50.7564 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్లు లెక్కలు తేల్చారు. దీని ప్రకారం ఒడిశా ఆంధ్రా కంటే 18.1108 టీఎంసీలు అధికంగా వినియోగించుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం బలిమెల జలాశయాల్లో 57.9941 టీఎంసీల నీటి నిల్వలు ఉండగా ఇందులో ఏపీ వాటా 38.0525 టీఎంసీలుగా, ఒడిశా వాటా 19.9416 టీఎంసీలుగా ఇరు రాష్ట్రాల అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, ఇరిగేషన్ అవసరాల నిమిత్తం 8500 క్యూసెక్కుల నీటిని ఏపీకి, 2000 క్యూసెక్కుల నీటిని ఒడిశాకు బలిమెల జలాశయం నుంచి విడుదల చేయడానికి ఒప్పందం కుదిరింది. ఈ కార్యక్రమంలో జెన్‌కో సీలేరు కాంప్లెక్స్ సూపరింటెండింగ్ ఇంజినీర్ బి.చంద్రశేఖర్‌రెడ్డి, ఈఈలు ఎం.శ్రీనివాసరావు, వి.రాజేంద్రప్రసాద్. ఏడీఈ దుర్గా శ్రీనివాసరావు, ఏఈఈ సీహెచ్ సురేష్‌లు పాల్గొన్నారు.