కొండ దిగాలంటే.. లేఖ ఉండాల్సిందేనా? | - | Sakshi
Sakshi News home page

కొండ దిగాలంటే.. లేఖ ఉండాల్సిందేనా?

Aug 20 2024 2:36 AM | Updated on Aug 20 2024 2:36 AM

సాక్షి,పాడేరు: ఉమ్మడి విశాఖ జిల్లాలోని పాడేరు డివిజన్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన పలుశాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు మైదాన ప్రాంతాల బదిలీల ప్రక్రియలో పైరవీలు జోరందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 15 ప్రభుత్వ శాఖల్లో సాధారణ బదిలీలకు ఈ నెల 17న నోటిఫికేషన్‌ ఇవ్వడం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో కొండ దిగాలంటే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేల సిపార్సు లేఖలు తప్పనిసరి అన్న విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు అనేక ఇబ్బందులు పడి గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన అధికారులు, ఉద్యోగులు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పలు ప్రాంతాలకు బదిలీ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది.

ముడుపులివ్వాలని ప్రచారం

ఏజెన్సీలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు రెండేళ్ల సర్వీసు పూర్తి చేస్తే బదిలీలకు అర్హులు. ఈ మేరకు అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడిన తరువాత పలు జిల్లాల నుంచి పాడేరు డివిజన్‌లో ఉద్యోగాల్లో చేరిన అధికారులు, ఉద్యోగులు కూడా తమ సొంత ప్రాంతాలకు బదిలీకి మైదాన ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలను ఆశ్రయిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. కోరిన చోటకు బదిలీకి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు డిమాండ్‌ ఉందని తెలుస్తోంది.

పారదర్శకం అమలయ్యేనా?

గ్రామ సచివాలయాల్లో నూరుశాతం ఉద్యోగాలన్నీ స్థానిక గిరిజనులకే గత ప్రభుత్వం ఇవ్వడంతో వారంతా పాడేరు డివిజన్‌ పరిధిలోనే బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. మిగిలిన శాఖల్లో పనిచేస్తున్న గిరిజనేతర అధికారులు, ఉద్యోగులు మాత్రం విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ, తూర్పుగోదావరి ప్రాంతాలకు వెళ్లేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో బదిలీలకు సంబంధం లేదని, బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటున్నా.. పైరవీలకే ప్రాధాన్యం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

అర్హులకు కోరిన చోటు కష్టమేనా..

ప్రతిశాఖలో పదుల సంఖ్యలో ఉన్నారు. పంచాయతీరాజ్‌ విభాగంలో మాత్రం ఎంపీడీవో నుంచి ఇంజినీరింగ్‌ అఽధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లు సుమారు 70 మంది వరకు బదిలీలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఏజెన్సీలో ఐదు నుంచి ఏడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారికి దరఖాస్తు చేసుకున్న చోట పోస్టింగ్‌ తప్పనిసరిగా ఇవ్వాలి. ఇలా నిబంధనలు ఉన్నా పైరవీల కారణంగా వీరికి కోరిన చోటకు పోస్టింగ్‌ దక్కే అవకాశాలు తక్కువేనని వినవస్తోంది. ఏజెన్సీలో రెండేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు కూడా కోరిన చోటకు వెళ్లేందుకు మైదాన ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల లేఖల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఆయా పోస్టులకు బదిలీ చేసేందుకు పెద్ద మొత్తంలో నగదు డిమాండ్‌ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

ఉద్యోగుల బదిలీలకు పైరవీల జోరు

కోరిన చోటకు వెళ్లేందుకు ప్రయత్నాలు

నిబంధనలు అమలుపై అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement