పాడేరు: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తూ, హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలని పాడేరు ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు.
మోదకొండమ్మ ఆలయంలో
ప్రత్యేక పూజలు
పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు శనివారం గిరిజనుల ఇలవేల్పు పాడేరు మోదకొండమ్మ తల్లి ఆలయంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. మాజీ మంత్రి, పార్టీ గాజువాక నియోజకవర్గ పరిశీలకుడు పసుపులేటి బాలరాజుతో కలిసి ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రభుత్వంపై విమర్శలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రానికి చైర్మన్‌గా ఉంటూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడును ముఖ్యమంత్రి చంద్రబాబు వెనకేసుకురావడం సిగ్గుచేటని విమర్శించారు. మహిళల గౌరవం గురించి గొప్పలు చెప్పే సీఎం, ఇన్ని ఆరోపణలు వస్తున్నా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తిరుమల ఖ్యాతిని మంటగలిపేలా ప్రవర్తిస్తున్న వ్యక్తిని వెంటబెట్టుకుని ఒంటిమెట్ట ఉగాది వేడుకల్లో పాల్గొనడం ఏమిటని నిలదీశారు.
పోరాటం ఆపేది లేదు
మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాట్లాడుతూ.. కళంకితుడైన వ్యక్తి చైర్మన్ పదవిలో కొనసాగడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన్ను తొలగించకపోతే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కూడా సురేష్‌కుమార్, రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి కూతంగి సూరిబాబు, మండల అధ్యక్షులు సీదరి రాంబాబు, నుర్మానీ మత్స్యకొండం నాయుడు, వైఎస్ ఎంపీపీలు కుడుముల సత్యనారాయణ, కుంతూరు కనకాలమ్మ, మాజీ ఎంపీపీ మత్స్యరాస వెంకటగంగరాజు, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి, పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
అపవిత్రమైన వ్యక్తిని తొలగించాలి:
అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
అరకులోయ టౌన్: పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా ఉన్న బీఆర్ నాయుడుని వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు శనివారం స్థానిక వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు గోబ్యాక్, వివాదాస్పద వ్యక్తిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలి.. అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్వామి వారు మంచి బుద్ధిని ప్రసాదించాలని, టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును మార్చాలని ప్రార్థించినట్లు తెలిపారు. అపవిత్రమైన వ్యక్తిని చైర్మన్‌గా కొనసాగిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతింటాయన్నారు. బీఆర్ నాయుడుకు కొమ్ముకాస్తున్న చంద్రబాబు ఇప్పటికై నా మేల్కొని అతడిని వెంటనే తొలగించి తిరుమల పవిత్రతను కాపాడాలన్నారు. ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయ చైర్మన్‌పై ఇన్ని ఆరోపణలు వస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? హిందూ ధర్మంపై ప్రేమ చూపే ప్రధాని మోదీ, సనాతన ధర్మం గురించి మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు? అని ప్రశ్నించారు. 2029లో జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, కూటమి ప్రభుత్వ ఆరాచకాలకు ప్రజలే గుణపాఠం చెబుతారని ఆమె అన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు కనీస గౌరవం ఇవ్వని వ్యక్తిని టీటీడీ చైర్మన్‌గా నియమించి చంద్రబాబు తిరుమల ప్రతిష్టను దిగజారుస్తున్నారన్నారు. తిరుపతిలో ఈ ఘటనపై నిరసన తెలిపిన మహిళలపై దాడి చేయడం దారుణం అన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు అశోక్ కుమార్, సర్పంచ్‌లు పెట్టెలి సుస్మిత, ఇరగాయి బుటికి, పాగి అప్పారావు, రాధిక, హరి, మండల పార్టీ అధ్యక్షులు రామూర్తి, పాంగి పరశురామ్, ఎంపీటీసీలు దురియా ఆనంద్ కుమార్, శత్రుఘ్న, రామచందర్, మాజీ ఎంపీపీ శెట్టి నీలవేణి,వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, కల్చరల్ వింగ్ నియోజకవర్గ అధ్యక్షుడు పెట్టెలి సుక్రయ్య, నాయకులు శోభ సోమేశ్వరి, చినసత్యం, నర్సింగరావు పాల్గొన్నారు.
అరకులో నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర,మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేతలు
పాడేరులో మోదకొండమ్మ ఆలయ ఆవరణలో బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రి బాలరాజు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు
బీఆర్ నాయుడును చైర్మన్
పదవి నుంచి తొలగించండి
ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం తీరుపై పాడేరు, అరకులో నిరసనలు
ఆలయాల్లో ప్రత్యేక పూజలు


