పాడేరు రూరల్: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో శనివారం అక్రమ దుకాణాల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. ముందస్తు సమాచారం ప్రకారమే తాము దుకాణాలను తొలగిస్తున్నామని పాడేరు మేజర్ పంచాయతీ ప్రత్యేక అధికారి రమేష్ స్పష్టం చేశారు.
సిబ్బంది, వ్యాపారుల మధ్య వాగ్వాదం
తొలగింపు చర్యలను చిరు వ్యాపారులు అడ్డుకోవడంతో పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది, వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేశారు. దీంతో గొడవ సద్దుమణిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ పట్టణంలోని పీఎంఆర్‌సీ జంక్షన్ నుంచి రేకుల కాలనీ వరకు రహదారికి ఇరువైపులా ఉన్న అక్రమ దుకాణాలను పోలీసుల సహాయంతో తొలగించామని తెలిపారు. అలాగే తలారిసింగి అగ్నిమాపక కేంద్రం (ఫైర్ స్టేషన్) నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా పాత బస్టాప్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తామన్నారు. పాడేరు జిల్లా కేంద్రం కావడంతో రోజురోజుకు వాహనాల తాకిడి, ప్రజల రద్దీ పెరుగుతోందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్నామని, ఎవరైనా అడ్డుకుంటే పోలీస్ కేసులు తప్పవని హెచ్చరించారు. పట్టణ సుందరీకరణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, వ్యాపార నిర్వాహకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది శేషగిరిరావు, చిన్ని, రాంనాయుడు తదితరులు పాల్గొన్నారు.
అడ్డుకున్న వ్యాపారులు
ముందస్తు సమాచారంతోనే చర్యలు.. ఈవో రమేష్
పోలీసుల రంగ ప్రవేశంతోసద్దు మణిగిన వివాదం


