● విలువ రూ.రూ.34,93,031
● పాడేరు డీఎస్పీ అభిషేక్ వెల్లడి
పాడేరు: గంజాయి అక్రమ రవాణా ద్వా రా ఆస్తులు కూడబెట్టిన ఒక స్మగ్లర్‌కు చెందిన ఆస్తులను జప్తు చేసినట్లు పాడే రు డీఎస్పీ అభిషేక్ వెల్లడించారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు.పాడేరు మండలం, డి.గొందూరు పంచాయతీ, పాలమామిడిశంక గ్రామానికి చెందిన డుంబేరి సతీష్ గతంలో గంజాయి వ్యాపారం చేస్తూ పలుమార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై మొత్తం నాలుగు కేసులు నమోదు కాగా వీటిలో ఒకటి పాడేరు పోలీస్ స్టేషన్ పరిధిలోనిది. గంజాయి విక్రయాల ద్వారా సతీష్ భారీగా ఆస్తులు సంపాదించాడనే సమాచారంతో పాడేరు సీఐ దీనబంధు నేతృత్వంలో ఆర్థిక విచారణ చేపట్టారు. దీనిలో భాగంగా ఒక భవనం, ఒక కారును గుర్తించి సీజ్ చేశారు. వీటి వివరాలను చైన్నెలోని కాంపిటెంట్ అథారిటీకి పంపించారు. అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేసిన అనంతరం, ఆ ఆస్తుల విలువ రూ.34,93,031 గా నిర్ధారించి వాటిని జప్తు చేశారు. జప్తు చేసిన వీటిని కొనుగోలు చేసేందుకు ఎవరికీ అవకాశం లేదని డీఎస్పీ స్పష్టం చేశారు. గతంలో గంజాయి వ్యాపారం చేసిన వారిపై, ప్రస్తుతం చేస్తున్న వారిపై గట్టి నిఘా ఉంచామని డీఎస్పీ తెలిపారు. అక్రమ సంపాదనతో కూడబెట్టిన వారి ఆస్తులపై కూడా విచారణ కొనసాగుతుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో పాడేరు సీఐ దీనబంధు పాల్గొన్నారు.


