కై లాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశ నిర్వహణపై ఎట్టకేలకు సందిగ్ధం వీడినట్లయింది. ఈ నెల 27న మధ్యాహ్నం 3గంటలకు ప్రత్యేక సమావేశం ఖరారైంది. ఇందుకు సంబంధించి సిద్ధం చేసిన అజెండాకు మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష ఆమోదం తెలిపారు. శనివారం రాత్రే అజెండాపై ఆమె సంతకం చేయగా ఆదివారం వేకువజామునే అన్ని పార్టీల కౌన్సిలర్లకు అజెండా కాపీలను అందజేశారు. అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక సమావేశం నిర్వహించనుండగా నలుగురు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారు. అయితే ఈ పదవులను ఏ పార్టీ కై వసం చేసుకుంటుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
4 పదవులకు 27 మంది పోటీ
ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో మొత్తం నాలుగు కోఆప్షన్ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంది. ఇందులో ఇద్దరు మైనార్టీ, మరో ఇద్దరు జనరల్ కోటా కింద ఎన్నిక జరపాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ 17న మున్సిపల్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. వారం గడువు విధిస్తూ అదే నెల 25వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంల నుంచి మొత్తం 28 దరఖాస్తులు అందాయి. వాటిని పరిశీలించిన అధికారులు నిబంధనల ప్రకారం లేకపోవడంతో ఒక దరఖాస్తును తిరస్కరించారు. ప్రస్తుతం నాలుగు పదవుల కోసం 27 మంది పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతీ అభ్యర్థికి సంబంధించి ఎన్నిక నిర్వహించనున్నారు. ఇందులో అత్యధిక మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఎవరికి ఉంటుందో వారు ఎన్నికై నట్లుగా ప్రకటిస్తారు.
పోటాపోటీ ..
కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు గతంలో ఎన్నడూలేని విధంగా పోటీ నెలకొంది. బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ముగ్గురితో దరఖాస్తు చేయించగా.. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల నుంచి పదవులను ఆశిస్తూ పలువురు పోటాపోటీగా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల నుంచి ఎంఐఎం సభ్యులు దరఖాస్తు చేసుకోగా, కాంగ్రెస్ సభ్యులు ఉన్న చోట బీఆర్‌ఎస్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ఆయా పార్టీల అఽధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఒకరికి మద్దతునిస్తే మరొకరు అసంతృప్తికి గురయ్యే అవకాశమున్నందున సపోర్ట్‌పై ఆయా పార్టీల కౌన్సిలర్లు ఆలోచనలో పడ్డారు. పదవులను ఎలాగైనా కై వసం చేసుకోవాలని భావిస్తున్న దరఖాస్తుదారులు, పార్టీలు ప్రలోభాలకు తెరలేపినట్లుగా తెలుస్తోంది. ఆయా పార్టీల తరఫున విప్ జారీ చేయనుండటంతో ఎన్నిక సమయంలో సమావేశానికి గైర్హాజరు కావాలని పలువురు కౌన్సిలర్లను కోరుతున్నారు. మద్దతు కూడగట్టిన కౌన్సిలర్లతో కలిసి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. సమావేశానికి రాకుంటే రూ.2లక్షల నుంచి రూ.5లక్షల నగదు ముట్టజెపుతామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
కౌన్సిల్‌లో పార్టీల వారీగా బలాబలాలు
బీజేపీ : 21 (ఎంపీ, ఎమ్మెల్యేతో
కలుపుకుంటే 23)
కాంగ్రెస్ : 11 బీఆర్‌ఎస్: 06
ఎంఐఎం : 06 స్వతంత్రులు: 05


