కైలాస్‌నగర్: ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈనెల 25 నుంచి 30 వరకు మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డితో కలిసి ఆదివారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, ‘మహిళా ఉన్నతి–తెలంగాణ ప్రగతి’ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ, జిల్లాల వారీగా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను సమీక్షించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. అవసరమైన చోట స్థానిక హమాలీలను నియమించుకోవాలని, రవాణా సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్లు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. తాలు, తరుగు పేరిట రైతుల ధాన్యంలో కోతలు విధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలి
అనంతరం కలెక్టర్ రాజర్షిషా అధికారులతో సమీక్షిస్తూ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచి నిర్దేశిత గడువులోపు పూర్తి చేసి రోజువారీ లక్ష్యాలను సాధించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళా వారోత్సవాలను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలని, ప్రతిరోజూ కార్యక్రమాలను మహిళలు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు ఆర్‌ఎస్. చిత్రు, ఎస్.రాజేశ్వర్, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, డీడబ్ల్యూవో మిల్కా, డీఎస్‌వో నందిని, సివిల్ సప్‌లై డీఎం సుధారాణి, డీఏవో శ్రీధర్, మార్కెటింగ్ అధికారి గజానన్, రవాణా అధికారి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


