బడి బస్సు భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

బడి బస్సు భద్రమేనా?

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

ఈనెల 15తో ముగిసిన ఫిట్‌నెస్‌ గడువు వాహనాల కండీషన్‌పై అనుమానాలు అధికారులు స్పందించకుంటే విద్యార్థులకు ప్రాణసంకటమే

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో బడి బస్సు భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఫిట్‌నెస్‌ గడువు ముగిసినా యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. చిరిగిన సీట్లు, అరిగిన టైర్లు, పగిలిన అద్దాలతోనే ఏటా రోడ్లపై తిరుగుతున్నాయని తల్లిదండ్రుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌, పర్మిట్‌ గడువు ముగిసినా సంబంధిత అధికారులు మామూలుగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఏటా ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు హడావుడి తప్పితే తర్వాత పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కాలం చెల్లిన బస్సులు..

పిల్లలను పాఠశాలలకు తీసుకెళ్లాల్సిన ఆయా బస్సుల కండీషన్‌ దారుణంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సిన యాజమాన్యాలు ఆ దిశగా దృష్టి సారించడం లేదు. ఈనెల 15తో బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసింది. జిల్లాలో ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు 233 ఉండగా, ఇప్పటివరకు కేవలం 30కి మాత్రమే ఫిట్‌నెస్‌ చేయించుకోవడం గమనార్హం. వాహనాల సామర్థ్యాన్ని పరిశీలించాల్సిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. కొందరు కాలం చెల్లిన బస్సులను రోడ్లపై తిప్పుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

జూన్‌ 12 నుంచి బడులు పునఃప్రారంభం

ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉండడంతో స్కూల్‌ బస్సులు మూలనపడ్డాయి. చాలా వరకు మరమ్మతుల్లో ఉన్నాయి. బడి పునఃప్రారంభం అ య్యే నాటికి సిద్ధం చేసుకోవాల్సిన యాజమాన్యాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని తెలుస్తోంది. సెలవులు ముగియక ముందే బస్సుల్లో సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర సామగ్రి అన్ని సక్రమంగా ఉన్నా యా.. లేదా.? చూసుకోవాలని రవాణా శాఖ అ ధికారులు సూచిస్తున్నారు. అలాగే ఈ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్‌ వయసు 60 ఏళ్లకు మించొద్దు. ఫిట్‌నెస్‌, ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాలతో కూడిన పట్టిక నమోదు చేసి ఉంచాలి. అలాగే వాహనాన్ని 15 సంవత్సరా లు మించి నడపరాదు. అయితే జిల్లాలో ఈ నిబంధనలను చాలా చాలా పాఠశాలలు విస్మరిస్తూ కండీషన్‌ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తున్నాయి. దీంతో చిన్నారులకు ఇబ్బందులు తప్పడం లేదు.

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. ఈనెల 15తో బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసింది. మరమ్మతులు పూర్తి చేసుకుని ఫిట్‌నెస్‌ చేయించుకోవాలి. డ్రైవర్లు, క్లీనర్లు, యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తాం. కాలంచెల్లిన వాహనాలను నడపొద్దు. తరచూ తనిఖీలు చేపట్టి పర్యవేక్షిస్తాం. భద్రత విషయంలో రాజీ పడేది లేదు.

– సీపెల్లి శ్రీనివాస్‌, జిల్లా రవాణాశాఖ అధికారి, ఆదిలాబాద్‌

జిల్లాలో

ప్రైవేట్‌ పాఠశాలలు: 167

అందులో విద్యార్థులు: 45వేలు

పైవేట్‌ స్కూల్‌ బస్సులు: 233

ఇప్పటి వరకు ఫిట్‌నెస్‌ చేయించుకున్నవి : 30

Advertisement
 
Advertisement
Advertisement