మెప్మా బ్యాంకు లింకేజీ రుణలక్ష్యం ఖరారు గతేడాదితో పోల్చితే రూ.7.04 కోట్లు అదనం పట్టణ మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత
కై లాస్‌నగర్: పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహా యక సంఘాల మహిళలకు మెప్మా ద్వారా అందించే బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరా రు చేసింది. 2026–27ఆర్థిక సంవత్సరానికి గాను ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలో రూ.51.20 కోట్లు అందించాలని లక్ష్యంగా నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది లక్ష్యంతో పోల్చితే ఈ ఏడాది రూ.7.04కోట్లు అదనంగా కేటాయించింది. తదనుగుణంగా అర్హులైన సంఘాలకు రుణాలు అందించే దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. అర్హత గల ఒక్కో సంఘానికి రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు అందజేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
ఆర్థిక స్థిరత్వం సాధించేలా..
స్వయం సహాయక సంఘాల్లోని మహిళా సభ్యులు ఆర్థిక స్థిరత్వం సాధించడంతో పాటు వ్యాపారులుగా ఎదగాలనే ఉద్దేశంతో బ్యాంకుల ద్వారా ప్ర భుత్వం రుణాలు అందిస్తోంది. టైలరింగ్, కిరాణ, సెంట్రింగ్, ఆహార ఉత్పత్తుల తయారీ, కుటీర పరిశ్రమల ఏర్పాటు, పాడి ఉత్పత్తి, కోళ్ల పెంపకం వంటి వ్యాపారాలకు ఆర్థికంగా చేయూతనంది స్తోంది. ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు ఉండగా వారి రుణ వాయిదాల చెల్లింపు ఆధారంగా రూ.5లక్షల నుంచి రూ.20లక్షల వరకు రుణాలు అందజేస్తోంది. వీటి ద్వారా ఆయా వ్యాపారాల్లో రాణించడంతో పాటు కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలిచే అవకాశం ఏర్పడుతుంది. అయితే చాలా మంది సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకుండా వెనుకబడిపోతున్నారు. అయితే అలాంటి వారిని కొత్త రుణాలకు అనర్హులుగా ప్రకటిస్తున్నారు.
గతేడాది లక్ష్యానికి మించి..
గతేడాది లక్ష్యం కేటాయింపు నుంచే బ్యాంకులు, సంఘాల వారీగా మెప్మా సిబ్బంది పక్కా కార్యాచరణతో ముందుకు సాగారు. వారి కృషి ఫలితంగా లక్ష్యానికి మించి రుణాలు అందించారు. 441 సంఘాలకు గాను రూ.59.93 కోట్లు అందజేశారు. ల క్ష్యానికి మించి 35శాతం అధికంగా పంపిణీ చేసి మ హిళల ఆర్థికాభ్యున్నతికి అండగా నిలిచారు. కాగా ఈ ఏడాది సంఘాల సంఖ్యతో పాటు రూ.7కోట్లు అదనంగా పెంచారు. రుణాల మంజూరుతో పాటు వాటిని తిరిగి చెల్లించేలా మెప్మా సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించినట్లయితే మరింత మందికి కొత్త రుణాలు అందజేసే అవకాశం ఏర్పడుతుంది.
సద్వినియోగం చేసుకోవాలి
ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని ప్రభుత్వం ఖరారు చేసింది. గతేడాదితో పోల్చితే రూ.7కోట్లు అదనంగా కేటాయించింది. పట్టణానికి కేటాయించిన రుణలక్ష్యంలో ప్రస్తుతం మున్సిపల్ పరిధిలో చేపట్టిన ‘ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా పలు సంఘాలకు రుణాలు అందజేస్తున్నాం. ప్రతీ సంఘానికి రుణం అందించేలా శ్రద్ధ వహిస్తాం. వందశాతం లక్ష్యాన్ని సాధించేలా ముందుకు సాగుతాం.
– సీవీఎన్.రాజు, మెప్మా పీడీ
సంవత్సరం సంఘాలు కేటాయించిన లక్ష్యం సంఘాలు మంజూరు చేసిన మొత్తం
2024–25 421 రూ.40.22 కోట్లు 382 రూ.72.93 కోట్లు(181శాతం)
2025–26 416 రూ.44.16 కోట్లు 441 రూ.59.93 కోట్లు(135శాతం)
2026–27 453 రూ.51.20 కోట్లు –– ––


