పట్టపగలు ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

పట్టపగలు ఇంట్లో చోరీ

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

భైంసారూరల్‌: పట్టపగలు ఇంట్లోకి చొరబడి నగదు, బంగారం అపహరించిన ఘటనలో నిందితుడిని శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6న మండలంలోని దేగాం గ్రామానికి చెందిన దావుల మయూరి ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లింది. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో ఉన్న సుమారు మూడు మాసాల బంగారం, రూ.1,500 నగదు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా ఆధారాలు సేకరించి, అదే గ్రామానికి చెందిన పోశెట్టిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరాన్ని అంగీకరించినట్లు సీఐ పేర్కొన్నారు. రూ.4వేల నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఎస్సై సుప్రియ, సిబ్బంది ఉన్నారు.

గుర్తు తెలియని మృతదేహం లభ్యం

భైంసాటౌన్‌: పట్టణంలోని భైంసా–బాసర మార్గంలోని సాత్‌పూల్‌ వంతెన కింద శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించేందుకు చర్యలు చేపట్టారు. బురదనీటిలో కుళ్లిన స్థితిలో ఉండడంతో గుర్తు పట్టలేని విధంగా ఉంది. మృతదేహాన్ని వెలికి తీయించి ఏరియాస్పత్రిలోని మార్చురీకి తరలిస్తామని సీఐ సాయికుమార్‌ తెలిపారు.

ఏఈవోను దూషించిన వ్యక్తిపై అట్రాసిటీ కేసు

నేరడిగొండ: ఏఈవోను కులం పేరుతో దూషించి బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఇచ్చోడ రూరల్‌ సీఐ రమేశ్‌ తెలిపారు. యాసంగి పంట నమోదు ప్రక్రియ చేపడుతున్న క్రమంలో కుమారి గ్రామానికి చెందిన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి తన భూమి వివరాలు తిరిగి నమోదు చేయాలని ఏఈవోకు తరచూ ఫోన్‌ చేసి ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. కులం పేరుతో దూషించి బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ చైర్మన్ల నియామకం

కైలాస్‌నగర్‌: కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా చైర్మన్లను నియమిస్తూ ఆ విభాగం రాష్ట్ర చైర్మన్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా చైర్మన్‌గా కొలేట్కర్‌ పరమేశ్వర్‌, నిర్మల్‌ జిల్లా చైర్మన్‌గా కట్టా శ్యాంసుందర్‌, మంచిర్యాల జిల్లాకు పి.నర్సిములు, కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా చైర్మన్‌గా దుర్గం హంసరాజ్‌ను నియమించారు.

Advertisement
 
Advertisement
Advertisement