లక్ష్మణచాంద: నిర్మల్ జిల్లా కేంద్రానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలోని వడ్యాల్ గ్రామంలో అరుదైన ప్రాచీన శిలాశాసనాలను గుర్తించినట్లు ప్రముఖ కవి, చరిత్ర పరిశోధకుడు తుమ్మల దేవరావ్ తెలిపారు. శుక్రవారం ఆయన అబ్బడి రాజేశ్వర్‌రెడ్డి కలిసి గ్రామాన్ని సందర్శించారు. గ్రామానికి పశ్చిమ దిక్కునున్న ఓ రైతు వ్యవసాయ క్షేత్రంలోని హనుమాన్ ఆలయ సమీపంలో నాలుగు అడుగుల ఎత్తైన దీపపు స్తంభంపై చెక్కబడిన దాన శాసనం, మరో రెండు లఘు శాసనాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. శాసనంలోని అక్షరాలను మధ్యయుగపు తెలుగు–కన్నడ లిపికి చెందినవిగా గుర్తించవచ్చని తెలిపారు. శాసనం ప్రారంభంలో ‘స్వస్తి శ్రీ’ అని స్పష్టంగా కనిపిస్తుండగా ఇది దాన శాసనంగా భా విస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై మరింత శాసీ్త్రయ పరిశోధన అవసరమని అభిప్రాయపడ్డారు. దీపపు స్తంభంపై కనిపిస్తున్న శాసనం 11–15 శతాబ్దాల మధ్యకాలానికి చెందినదై ఉండవచ్చని పేర్కొన్నారు. మరో రాయిపైనున్న అస్పష్ట శాసనంలోని అక్షరాలు దేవనాగరి లిపిని పోలి ఉన్నాయని తెలిపారు. గ్రామ దేవతకు సంబంధించిన శిలపై సింధూరం పూయడంతో పూర్తి శాసనాన్ని స్పష్టంగా చదవడం సాధ్యపడలేదని తెలిపారు. ఆలయ ప్రాంగణంలో మరో లఘు శాసనాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఈ మూడు శాసనాలు కళ్యాణి చాళుక్యుల కాలం నుంచి కాకతీయుల మధ్యయుగ కాలానికి చెందినవిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు నిర్మల్ జిల్లాలో 18 శాసనాలను వెలుగులోకి తీసుకువచ్చి వాటిపై పరిశోధనలు నిర్వహించినట్లు వివరించారు.


