ఖానాపూర్: మండలంలోని బిర్నంది గ్రామానికి చెందిన శాఖాపురం మల్లేశ్ (42) దుబాయిలో అనారోగ్యంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్లేశ్ రెండేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం దుబాయికి వెళ్లి అక్కడి ఓ పెయింటింగ్ కంపెనీలో ప్యాకింగ్ పనులు చేస్తున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమవుతున్న క్రమంలో అనారోగ్యానికి గురయ్యాడు. దాదాపు 10రోజులకుపైగా అక్కడే చికిత్స పొందుతూ ఈ నెల 18న మృతి చెందాడు. మృతుడికి భార్య కవిత, కుమారుడు శ్రీనాథ్, కుమార్తె శ్రీనిధి ఉన్నారు. శుక్రవారం మల్లేశ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇంటికి పెద్దదిక్కు కోల్పోయామని కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
అగ్నిప్రమాదంలో 10 గొర్రెలు మృతి
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో శుక్రవారం ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పది గొర్రెలు ఆహుతి అయ్యాయి. మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ గ్రామానికి చెందిన గొర్రెలకాపరులు రెండు నెలల క్రితం ఓదెల మండలం కనగర్తికి మన్నెం వచ్చారు. గ్రామ శివారులో 150 గొర్రెలు, మేకలతో మంద పెట్టారు. అక్కడే గుడారాలు వేసుకుని ఉంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా గాలి వీచడంతో సమీపంలోని కరెంట్ తీగలు రాపిడికి గురయ్యాయి. ఈక్రమంలో నిప్పురవ్వలు ఎగిసిపడి పొలంలోని వరి కొయ్యకాలుకు అంటుకున్నాయి. ఆ వెంటనే పొలం మొత్తం వ్యాపించాయి. గొర్రెలు, మేకలున్నచోటుకు రావడంతో కాపరులు మందను దూరంగా పరుగెత్తించేందుకు యత్నించారు. ఈక్రమంలో అందులోని పది గొర్రెలు అగ్నికి ఆహుతయ్యాయి. మిగతా జీవులు, కాపరులు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. స్థానికులు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. కళ్లముందే కాలిపోయిన గొర్రెలను చూస్తూ గొర్రెలకాపరులు రోదించారు.


