వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో ఉపాధి కూలీ మృతి

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

జన్నారం: ఉట్నూర్‌ మండలం ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీ వడదెబ్బతో మృతి చెందిన ఘటన జన్నారంలో చోటు చేసుకుంది. ఎస్సై ఉదయ్‌కిరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ మండల ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన కోవ కిరణ్‌కుమార్‌ (27) ఉపాధిహామీ కూలీగా పని చేస్తున్నాడు. ఈ నెల 21న ఉపాధిహామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఆయన సెల్‌ఫోన్‌ మరమ్మతు చేయించుకునేందుకు జన్నారం వెళ్తానని ఇంట్లోంచి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. శుక్రవారం ఉదయం జన్నారం బస్టాండ్‌లో ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం రావడంతో ఎస్సై అక్కడికి వెళ్లి పరిశీలించారు. కిరణ్‌కుమార్‌ మృతదేహంగా అతడి కుటుంబ సభ్యులు గుర్తించారు. అయితే.. వడదెబ్బతో చనిపోయినట్లు మృతుడి అన్న కోవా సుంగు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కుచులాపూర్‌లో వ్యవసాయ కూలీ..

తాంసి: తలమడుగు మండలంలోని కుచులాపూర్‌ గ్రామానికి చెందిన ఆత్రం రాము (44) అనే వ్యవసాయ కూలీ గురువారం చేను పనికి వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురికాగా గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేందుకు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే క్రమంలో ఇంటి వద్దే రాము మృతిచెందాడు.

Advertisement
 
Advertisement
Advertisement