కై లాస్‌నగర్: దేశంలో ఐటీ రంగానికి నాంది పలికిన ఘనత రాజీవ్ గాంధీదేనని డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్ అన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని గురువారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఆదివాసీ కాంగ్రెస్ నేషనల్ కో ఆర్డినేటర్ కుసుమ్ ఆలంతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ జీవితం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. ఆయన వర్ధంతి రోజున దేశవ్యాప్తంగా ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న సందర్భంగా ప్రతీ భారతీయుడు హింసకు వ్యతిరేకంగా, శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బండారి అనూష, గండ్రత్ సుజాత, సంజీవరెడ్డి బండి దేవిదాస్ చారి, గౌలి సంజయ్, తదితరులు పాల్గొన్నారు.


