కైలాస్‌నగర్: జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తూ పర్యాటకరంగ అభివృద్ధిలో యువ ఇన్‌ఫ్లుయెన్సర్ల భాగస్వామ్యం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక టీటీడీసీలో డిజిటల్ టూరిజం ఛాలెంజ్–రీల్స్ కాంపిటీషన్ నిర్వహించారు. పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు హాజరై యూట్యూబ్, ఇన్‌స్టాలో పర్యాటకరంగంపై పెట్టిన పోస్టులను ప్రదర్శించారు. ఆర్.సాయికృష్ణ ప్రథమ బహుమతి, పెందూర్ కిరణ్ ద్వితీయ బహుమతి, రవి, తొడసం కై లాష్ తృతీయ బహుమతి అందుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక దేవాలయాలు, అటవీ ప్రాంతాలు, ప్రకృతి అందాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, స్థానిక పండుగలను డిజిటల్ మీడియా వేదికగా దేశవ్యాప్తంగా పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. అనంతరం అక్రిడిటేషన్ కమిటీ సభ్యులకు నూతన అక్రిడేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, టూరిజం అధికారి రవి కుమార్, డీపీఆర్‌వో విష్ణువర్ధన్, తదితరులు పాల్గొన్నారు.
జనాభా వివరాలు నమోదు
కై లాస్‌నగర్: జాతీయ జనగణన (సెన్సెస్) సర్వేలో భాగంగా కలెక్టర్ రాజర్షిషా డిజిటల్ పద్ధతిలో తన కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు.
మట్టి సేకరణకు కుమ్మరులకు అనుమతి
కైలాస్‌నగర్: కులవృత్తిపై ఆధారపడ్డ కుమ్మరులకు మట్టి సేకరణకు అనుమతినిచ్చినట్లు కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. కలెక్టర్ చాంబర్‌లో కుమ్మరి సంఘం ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. చెరువులు, కుంటల నుంచి ఉచితంగా మట్టిని తీసుకునే హక్కు కుమ్మరులకు ఉందని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, బస్టాండ్ ప్రాంతాల్లో మట్టి కుండలు విక్రయించేందుకు స్థల కేటాయింపు అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.
జొన్న కొనుగోలు కేంద్రం సందర్శన
సాత్నాల: భోరజ్ మండలం పిప్పర్‌వాడలోని జొన్న కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాథోడ్ రాజేశ్వరి, మండల వ్యవసాయ అధికారి ఆశ్రఫ్, రైతులు పాల్గొన్నారు.
క్రీడలు శారీరక దృఢత్వానికి పునాదులు
ఆదిలాబాద్: క్రీడలు శారీరక దృఢత్వానికి పునాదులు అని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్, అధికారులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


