ఆదిలాబాద్‌టౌన్: సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదిలాబాద్ పరిశ్రమను వెంటనే పునఃప్రారంభించాలని ప్రజా, ఉద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేశారు. డీటీఎఫ్ నాయకుడు రంగన్న అధ్యక్షతన జిల్లా కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా టాస్క్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ కేవలం రూ.2వేల కోట్ల పెట్టుబడితో తిరిగి పునరుద్ధరించే అవకాశం ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా లేఖలతో సరిపెట్టకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి పరిశ్రమ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణమే తుక్కు టెండర్లను రద్దు చేసి పరిశ్రమ పునరుద్ధరణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో టాస్క్ కోకన్వీనర్ రవీందర్, ప్రైవేట్ కాలేజీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకుడు విలాస్, బీఆర్‌ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ, న్యూ డెమోక్రసీ నాయకుడు వెంకట్ నారాయణ, మాస్‌లైన్ నాయకుడు జగన్ సింగ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి దేవేందర్, సీసీఐ సాధన ఉద్యమ నాయకుడు నవతె శ్రీనివాస్, తుడుందెబ్బ నాయకులు పాల్గొన్నారు.


