బెస్ట్‌ చదువులు చెప్పలేం! | - | Sakshi
Sakshi News home page

బెస్ట్‌ చదువులు చెప్పలేం!

May 21 2026 2:17 AM | Updated on May 21 2026 2:17 AM

చేతులెత్తేసిన ప్రైవేట్‌ స్కూళ్లు మూడేళ్లుగా బకాయిలు పెండింగ్‌ గతేడాది పలుమార్లు బడుల మూసివేత నిధులు విడుదల చేస్తేనే విద్యార్థులను అనుమతిస్తామంటున్న నిర్వాహకులు అయోమయంలో తల్లిదండ్రులు

ఆదిలాబాద్‌టౌన్‌/ఆదిలాబాద్‌రూరల్‌: బెస్ట్‌ అవలేబుల్‌ పథకంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు చదువులు చెప్పలేమని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దీంతో పేద విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. గతేడాది పలుమార్లు బడులు మూసివేయడంతో విద్యార్థుల చదువులు కుంటుపడ్డాయి. ప్రైవేట్‌ స్కూళ్లను అధికారులు బుజ్జగించి విద్యా సంవత్సరాన్ని పూర్తి చేశారు. నూతన విద్యా సంవత్సరం జూన్‌ 12న ప్రారంభం కానుంది. ఇప్పటికే సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా నోటిఫికేషన్‌ విడుదలైంది. గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థుల ఎంపిక పూర్తయింది. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే గానీ చదువు చెప్పేది లేదని ఆయా పాఠశాలలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా లేఖలు సైతం అందజేశాయి. దీంతో బెస్ట్‌ అవలేబుల్‌ పథకం నీరుగారనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చదువులు కొనసాగిస్తున్న విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఈ విషయమై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పథకం కొనసాగుతుందా.. లేదా అని తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు.

మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌..

ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించేందుకు ప్రభుత్వం 2004లో బెస్ట్‌ అవలేబుల్‌ పథకాన్ని ప్రారంభించింది. మొదట్లో ఈ పథకం సాఫీగా సాగింది. మూడేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఈ పథకం కింద జిల్లాలో ఆరు పాఠశాలల్లో విద్యాబోధన సాగుతుంది. సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 1 నుంచి పదో తరగతి చదువుతున్న దాదాపు 250 మందికి విద్యాబోధన చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 730 మంది విద్యార్థులు 3 నుంచి 10వ తరగతి వరకు చదువుకుంటున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డేస్కాలర్‌ విద్యార్థులకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.28వేలు, రెసిడెన్షియల్‌ విద్యార్థులకు రూ.42వేలు చెల్లిస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ రూ.42వేలు విద్యార్థి చదువుకు కేటాయిస్తుంది. అయితే సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా ఆరు పాఠశాలలకు కలిపి దాదాపు రూ.15 కోట్ల వరకు బకాయిలు ఉన్నట్లు చెబుతున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.5 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో విద్యార్థులకు భోజనం, చదువు కొనసాగించలేమని ప్రైవేట్‌ యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.

చేతులెత్తేసిన యాజమాన్యాలు

ఈ స్కీమ్‌ను తాము నడపలేమని ఆరు ప్రైవేట్‌ స్కూళ్లు చేతులెత్తేశాయి. మూడేళ్లుగా నిధులు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల లేఖ ఇ వ్వడంతో అధికారులు 25 శాతం విడుదల చేశారని పేర్కొంటున్నారు. పెండింగ్‌ బిల్లుల విడుదలతో పాటు విద్యార్థుల ఫీజు సైతం పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పలుమార్లు ఇంటికి పంపారు..

మా బాబును బెస్ట్‌ అవలేబుల్‌ పథకం కింద మావలలోని పాఠశాలలో చేర్పించాం. ప్రభుత్వం బిల్లులిస్తలేదని గతేడాది పలుమార్లు అబ్బాయిని ఇంటికి పంపించారు. ఈ సారి బిల్లులొస్తేనే చదువు చెబుతామని అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా ప్రభుత్వం స్పందించాలి. – సంతోష్‌, మావల

Advertisement
 
Advertisement
Advertisement