ఆదిలాబాద్‌టౌన్: నేరాల నియంత్రణలో భాగంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, అక్రమ రవాణా అరికట్టేందుకు బుధవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నాకాబందీ నిర్వహించినట్లు పేర్కొన్నారు. 20 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 25 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ, నంబర్ ప్లేట్ లేని, సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారిపై చర్యలు చేపట్టారు.ఎస్పీ స్వయంగా ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని చెక్‌పోస్టులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. విధి నిర్వహనలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందులో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఇచ్చోడ సీఐ నరేష్, టూటౌన్ సీఐ కె.నాగరాజు, వన్‌టౌన్ సీఐ బి.సునీల్‌కుమార్‌తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బజార్‌హత్నూర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ
బజార్‌హత్నూర్: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో వీపీవో విధానం అమలు చేయాలన్నారు. ఇందులో డీఎస్పీ జీవన్‌రెడ్డి, బోథ్ సీఐ గురుస్వామి, ఎస్సై రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
ఇచ్చోడ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మండలంలోని గుండాలలో బుధవారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వంద మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ (కార్డెన్‌సర్చ్) నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఇదివరకే కేసులు నమోదైన వారిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన తనిఖీల్లో ధ్రువీకరణ పత్రాలు సరిగాలేని 65 ద్విచక్రవాహనాలు, ఐదు ఆటోలు, ఒక బొలేరా వాహనంతో పాటు రూ.15 వేల విలువ చేసే కలప, కటింగ్ మిషన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇందులో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ పోతారం శ్రీనివాస్, సీఐలు సీహెచ్ రమేశ్, నరేశ్, నైలు, పద్మ, రిజర్వ్ సీఐ వెంకటి, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.


