ఇంద్రవెల్లి: మండలంలోని ముత్నూర్, కేస్లాపూర్, ఇంద్రవెల్లి గ్రామాల్లో పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ వెస్లీ, ఆయా జిల్లాల్లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన డీపీవోలు బుధవారం సాయంత్రం పర్యటించారు. ముందుగా ముత్నూర్ గ్రామాన్ని సందర్శించి నర్సరీ నిర్వహణతో పాటు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడి నుంచి కేస్లాపూర్ చేరుకుని నాగోబా ఆలయంలో పూజలు చేపట్టారు. మెస్రం వంశీయులతో మాట్లాడి ఆలయ చరిత్ర, అభివృద్ధి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపాన్ని సందర్శించి స్మృతి వనంను పరిశీలించారు. అక్కడి నుంచి ఇంద్రవెల్లి మేజర్ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి గ్రామాభివృద్ధి, స్వచ్ఛత, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి వెంట వనపర్తి డీపీవో తరుణ్ చక్రవర్తి, భద్రాద్రి డీపీవో బి అనూష, జగిత్యాల డీపీవో రేవంత్, సిద్దిపేట డీపీవో వినోద్‌కుమార్, ఆదిలాబాద్ డీపీవో ఫణిందర్‌రావ్, పంచాయతీ సిబ్బంది తదితరులున్నారు.


