జిల్లా కేంద్రంలో ఎకరం స్థలం కేటాయింపు రైతులకు సంబంధించిన విలువైన భూమి అంటున్న బీజేపీ నాటి బీఆర్‌ఎస్ విధానాన్నే కాంగ్రెస్ అవలంబిస్తుందంటూ ధ్వజం ఇరు పార్టీలు సహకరించుకుంటున్నాయని విమర్శ
సాక్షి,ఆదిలాబాద్: హస్తం పార్టీ కార్యాలయం కోసం జిల్లా కేంద్రంలోని విజయ డెయిరీలో ఎకరం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది. దీనిపై బీజేపీ విమర్శలు గుప్పిస్తుండగా, బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ నిర్ణయానికి మద్దతు తెలపడంపై రామన్న ప్రజలకు సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే శంకర్ డిమాండ్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాలకు సొంత జాగా లేనిచోట స్థలం కేటాయిస్తూ ఇటీవల కేబినెట్ తీర్మానం చేసింది. ఆదిలాబాద్‌లో కలెక్టర్, ఎస్పీ క్యాంప్ కార్యాలయాలతో పాటు ఇతర ఉన్నతాధికారులు నివాసం ఉండే ప్రాంతంలోనే ఈ స్థలం ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఇటీవల మున్సిపల్ సమావేశం నిర్వహించారు. అందులో బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. అయితే బీఆర్‌ఎస్, ఎంఐఎంలు హస్తం పార్టీ నిర్ణయాన్ని సమర్థించాయి. దీనిపై ప్రస్తుతం రాజకీయ దుమారం చోటుచేసుకుంది.
రైతులకు సంబంధించిన భూమి..
జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కు వెనకాల విజయ డెయిరీకి విలువైన భూమి ఉంది. ఇందులో పాల శీతలీకరణ కేంద్రంతో పాటు ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించి క్వార్టర్స్ కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాల కోసం స్థలం కేటాయించాలంటూ ప్రభుత్వానికి కాంగ్రెస్ దరఖాస్తు చేసుకుంది. దీనిపై క్షేత్రస్థాయిలో ఆయా పార్టీల నాయకులు స్థల అన్వేషణ చేశారు. ఆఫీసర్స్ క్లబ్‌కు ఎదురుగా ఉన్న ఎస్సీ హాస్టల్, డీఎస్పీ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంతో పాటు విజయ డెయిరీ స్థలాన్ని పరిశీలించారు. అందులో ఎస్సీ హాస్టల్ స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ దీనిపై వివాదం చోటుచేసుకోవడంతో యంత్రాంగం దానికి ఒప్పుకోలేదు. దీంతో విజయ డెయిరీలోని ఖాళీ స్థలాన్ని ఎంపిక చేయగా, దానికి ఇటీవల కేబినెట్ ఆమోదం లభించింది.
బీఆర్‌ఎస్‌పై విమర్శలు..
రాష్ట్రస్థాయిలో బీఆర్‌ఎస్ తమను ప్రతిపక్షంగా చె ప్పుకుంటున్నప్పటికీ, ఆదిలాబాద్‌లో మాత్రం బీ ఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తూ రైతుల ప్రయోజ నాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తున్నాయని బీజే పీ ఆరోపిస్తోంది. రైతులకు సంబంధించిన విజయ డెయిరీ స్థలంలో విలువైన భూమిని పార్టీ కార్యాలయాల కోసం కేటాయించడాన్ని విమర్శిస్తోంది. దీనిపై కలెక్టర్ వెంటనే జోక్యం చేసుకొని రైతుల భూమిని కాపాడాలని ఎమ్మెల్యే శంకర్ కోరారు.


