కైలాస్‌నగర్: ఆదిలాబాద్ మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి ప్రత్యేక సమావేశ నిర్వహణపై సందిగ్ధం వీడటం లేదు. కౌన్సిల్‌లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ సమావేశ నిర్వహణకు పట్టుబడుతుంది. సోమవారం నిర్వహించిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలోనూ ఆ పార్టీ కౌన్సిలర్లు ఇదే అంశంపై కమిషనర్‌ను ప్రశ్నించారు. చైర్‌పర్సన్ త్వరలోనే తేదీ ఖరారు చేస్తారంటూ కమిషనర్ చెప్పడంతో వెనక్కితగ్గారు. అయితే చైర్‌పర్సన్ ఎటూ తేల్చకపోవడంతో స్పష్టత రాని పరిస్థితి. రెండు, మూడు రోజుల్లోగా దీనిపై తేల్చని పక్షంలో కోర్టును ఆశ్రయించాలని కమలం పార్టీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగాలని అధికార పార్టీ భావిస్తోంది. ఇరు పార్టీల భిన్న నిర్ణయాలతో మున్సిపల్ అధికారులు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రత్యేక సమావేశానికి బీజేపీ డిమాండ్ ..
నాలుగు కోఆప్షన్ పదవులకు గాను బీజేపీ ముగ్గురిని బరిలో నిలిపింది. మరో స్థానం కోసం దరఖాస్తు చేసుకున్న మైనార్టీ వర్గానికి చెందిన మాజీ కౌన్సిలర్‌కు మద్దతు ఇస్తున్నట్లుగా ప్రచారం సాగుతుంది. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికలో విఫలమైన ఆ పార్టీ ఎలాగైన ఈ సారి నాలుగింటికి కై వసం చేసుకుని మున్సిపల్‌లో పట్టు నిలుపుకో వా లని భావిస్తోంది. ఆ దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కౌన్సిలర్లు మంగళవారం మరో సారి మున్సిపల్ కమిషనర్‌ను సంప్రదించారు. ప్రత్యేక సమావేశం తేదీ ఖరారుపై చర్చించారు. రెండు, మూడు రోజుల్లోగా తేల్చకపోతే కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఆ దిశగా కార్యాచరణ సైతం సిద్ధం చేస్తున్నారు.
ఆచితూచి వ్యవహరిస్తున్న చైర్‌పర్సన్
కోఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించిన ప్రత్యేక సమావేశం నిర్వహణపై నిర్ణయం తీసుకోవాల్సిన అధికారం చైర్‌పర్సన్‌పై ఉంటుంది. ఆమె నిర్ణయించే తేదీకనుగుణంగా బల్దియా అఽధికారులు తగు చర్యలు తీసుకుంటారు. అయితే ఈ విషయంలో చైర్‌పర్సన్ అనూష ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లితో పాటు డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌జాదవ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనివాస రెడ్డి ఆదేశాలకనుగుణంగానే ముందుకు సాగాలని ఆమె నిర్ణయించినట్లుగా ప్రచారం సాగుతుంది. వారిచ్చే ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో సమావేశం జరిగే అవకాశమున్నట్లుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.


