దిలావర్‌పూర్: ప్రమాదవశాత్తు కోనేరులో మునిగి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల మేరకు సారంగాపూర్ మండలంలోని తాండ్ర గ్రామానికి చెందిన పచ్చిమట్ల శ్రీనివాస్‌గౌడ్ మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి దిలావర్‌పూర్‌లోని ఎల్లమ్మ ఆలయంలో మొక్కులు చెల్లించుకునేందుకు వెళ్లారు. అతని చిన్న కుమారుడైన రోహిత్‌గౌడ్ (24) కోనేరులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయాడు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వడదెబ్బతో వృద్ధురాలు..
భైంసాటౌన్: పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన రావుల లక్ష్మీబాయి (68) వడదెబ్బతో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త, కుమారుడు గతంలోనే చనిపోగా, ఆమె కూరగాయలు విక్రయిస్తూ ఒంటరిగా ఉంటోంది. సోమవారం ఎప్పటిలాగే వారసంతలో కూరగాయలు విక్రయించేందుకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకుంది. వాంతులు చేసుకోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మంగళవారం ఉదయం స్థానికులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల బస్టాండ్ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టిన ఘటనలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం పాతమంచిర్యాలకు చెందిన పూదారి సూరయ్య బైక్‌పై మంచిర్యాల నుంచి ఇంటికి వెళ్తుండగా పాతమంచిర్యాల బస్టాండ్ సమీపంలో మంచిర్యాల నుంచి ఉట్నూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్ క్రాస్ చేస్తున్న సూరయ్య బైక్‌ను ఢీకొట్టింది. తీవ్రగాయాలు కావడంతో స్థానికులు 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులను వివరణ కోరగా బాధితుల నుంచి ఫిర్యాదు రాలేదన్నారు.


