కుభీర్: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట దగ్ధమైన ఘటన మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని దార్‌కుభీర్‌కు చెందిన కురుణబాయి అనే మహిళా రైతుకు తనకున్న 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేసింది. ఇటీవల పంటను కోసి చేనులోనే కుప్పగా వేసింది. కుమారుడికి వివాహం నిశ్చయం కావడంతో పంటనూర్పిడి చేయలేదు. మంగళవారం చేనుపై నుంచి వెళ్తున్న విద్యుత్ తీగలు ఒకదానికి ఒకటి తాకడంతో నిప్పురవ్వలు ఎగిసిపడి పంట దగ్ధమైంది. పక్కనే ఉన్న చేనులో రైతులు శేషరావ్, తోకల సుదర్శన్ వానాకాలంలో సాగు చేసేందుకు పసుపు విత్తనాలు కొనుగోలు చేసి కుప్పగా వేశారు. ఘటనలో పసుపు విత్తనాలు కూడా దగ్ధమయ్యాయి. సంఘటన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించారు. సుమారు 18 లక్షల వరకు నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.


