మామడ: అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని చెప్పాడు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి వెళ్లేందుకు తన ద్విచక్రవాహనంపై బస్టాండ్ వద్ద దింపాడు. తిరిగి ఇంటికి వెళ్తుండగా కారు రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మామడ మండలంలో సోమవారం జరిగింది. ఎస్సై హన్మాండ్లు కథనం ప్రకారం.. పొన్కల్ గ్రామానికి చెందిన బాయ గంగాధర్(60) తాపీ మేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అతని భార్య లింగవ్వ తనకు ఒంట్లో నలతగా ఉందని చెప్పడంతో ఆస్పత్రికి వెళ్లి చూపించుకోవాలని సూచించాడు. ఉదయం తన ద్విచక్రవాహనంపైనే మామడకు తీసుకువచ్చాడు. బస్టాప్‌లో భార్యను వదిలి తిరిగి పొన్కల్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో నిర్మల్ నుంచి కోరుట్ల వెళ్తున్న కారువేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగాధర్ తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. గంగాధర్‌కు భార్య, కుమారుడు, కూతురు ఉన్నా రు. ప్రమాద స్థలాన్ని ఎస్సై హన్మాండ్లు సందర్శించారు. మృతదేహాన్ని నిర్మల్ ఆస్పత్రికి తరలించా రు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


