ఆదిలాబాద్‌టౌన్: రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందాలంటే మార్కెటింగ్ విధానాలపై సమగ్ర అవగాహన అవసరమని అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో బుధవారం రైతు వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పంట మార్పిడి విధానం పాటించాలన్నారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న ధరల సమాచారం, మార్కెట్, నిల్వ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ సాగును లాభసాటిగా మార్చుకోవాలని కోరారు. అంతకుముందు రైతులను వారు శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, మార్కెటింగ్ ఏడీ గజానన్, మార్కెట్ కమిటీ సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


