లెక్చరర్లు, విద్యార్థులకు ఇక ఫేషియల్ రికగ్నిషన్ హాజరు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు ప్రైవేట్ కళాశాలల్లో సైతం.. ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు
ఆదిలాబాద్‌టౌన్: పాఠశాల, ఇంటర్ విద్యలో ఇప్పటికే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అటెండెన్స్‌ను ప్రభుత్వం అమలు చేస్తోంది. రానున్న విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలోనూ అమలుకు యోచిస్తోంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే ప్రవేశాల సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టగా తాజాగా విద్యార్థులు, లెక్చరర్లకు హాజరుపై దృష్టి సారించింది. ప్రభుత్వ కళాశాలలతో పాటు ప్రైవేట్‌లోనూ ఈ విధానం అమలు చేయనున్నారు. దీంతో సక్రమంగా విధులకు హాజరుకాని లెక్చరర్లు, డుమ్మా విద్యార్థులకు చెక్ పడనుంది. 75ఽశాతం అటెండెన్స్ ఉంటేనే పరీక్షలకు అనుమతించనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ విధానంతో డిగ్రీ విద్య మరింత బలోపేతమై మెరుగైన ఫలితాలు సాధించేందుకు అస్కారం ఏర్పడనుంది.
ఉత్తర్వులు విడుదల..
డిగ్రీ విద్యను గాడిలో పెట్టేందుకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా విద్యార్థులు, లెక్చరర్లకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు అమలు చేయాలని నిర్ణయించారు. శనివారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేశారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమలు కానుంది.
జిల్లాలో..
జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలల్లో తరగతులు సక్రమంగా నడుస్తుండగా మండల కేంద్రాల్లోని కాలేజీలు మాత్రం మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులు హాజరుకాకపోయినా అటెండెన్స్ వేస్తున్నారు. లెక్చరర్లు పూర్తిస్థాయిలో లేకున్నా.. ఉన్నట్లుగా రికార్డులు నిర్వహిస్తున్నారు. దీంతో పేద విద్యార్థులకు నష్టం వాటిల్లుతుంది. ప్రవేశాల సమయంలోనే తరగతులకు హాజరుకాకపోయినా పర్వాలేదంటూ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే కాలేజీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పరీక్షల సమయంలో ఫలితాల కోసం ఆయా ప్రైవేట్ కళాశాలలు పరస్పరం సహకరించుకుంటూ అడ్డదారులు తొక్కుతున్నాయనే విమర్శలున్నాయి. అయితే డిగ్రీ పాసైన వారిలో అత్యధికులు పోటీ పరీక్షల్లో వెనుకబడిపోతుండడం గమనార్హం. ఇలాంటి పరిస్థితులకు పూర్తిగా చెక్‌పెట్టాలనే ఉద్దేశంతో ఎఫ్‌ఆర్‌ఎస్ అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది.
జిల్లాలో
ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు 36
ఇందులో చదివే విద్యార్థులు 15వేల మంది
75 శాతం హాజరు ఉండాల్సిందే..
విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫేషియల్ అటెండెన్స్ అమలులో ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల లెక్చరర్లకు గతనెల 25 నుంచే ఎఫ్‌ఆర్‌ఎస్ అమలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రైవేట్ కళాశాలల లెక్చరర్లు, విద్యార్థులకు అమలు కానుంది. చాలా మంది విద్యార్థులు అడ్మిషన్ తీసుకొని తరగతులకు హాజరు కావడం లేదు. దీంతో స్కిల్స్ నేర్చుకోవడం లేదు. ప్రభుత్వం డిగ్రీ విద్యపై ఫోకస్ పెట్టింది. ఇంటెన్‌షిప్ ఇవ్వడానికి సిద్ధమైంది. – శ్రీనివాస్,
ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్


