మంచిర్యాలటౌన్: మెడికల్ దుకాణాల నిర్వాహకులు వైద్యుల సూచన మేరకే మందులు విక్రయించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఔషధ నియంత్రణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ చందన ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నిష్ణాతులైన వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నారని, ప్రజలు వైద్య సేవలు పొందాలని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏడు పడకలతో ఏర్పాటు చేసిన డ్రగ్స్ డీ అడిక్షన్ సెంటర్‌ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అనిత, ఆసుపత్రి సూపరింటెండెంట్ వేదవ్యాస్, ఆర్‌ఎంవో భీష్మతో కలిసి ప్రారంభించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు సెంటర్‌ను ప్రారంభించి, వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయంపై హెల్ప్‌లైన్ నంబర్లు 14416, 1908లో సమాచారం ఇవ్వాలని అన్నారు. అనంతరం వైద్య విద్యార్థులతో జీవితంలో ఎలాంటి మత్తు పదార్థాలు తీసుకోబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కెమిస్టు, డ్రగ్గిస్టు అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, సుధాకర్, వైద్యులు సునిల్‌కుమార్, కిరణ్‌కుమార్, నర్సింగ్ అధికారులు, డెమో బుక్క వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


