ఆదిలాబాద్: క్రీడారంగంలో రాష్ట్రాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ప్రతిభ ఉన్నా ఎంతోమంది నిరుపేద క్రీడాకారులు మరుగున పడుతున్నారు. కలెక్టరేట్ సమీపంలో చేపట్టిన అధునాతన ఇండోర్ స్టేడియం పనులు నిధుల విడుదలలో జాప్యంతో పిల్లర్ల దశలోనే నిలిచిపోయాయి.
వసతుల లేమితో అవస్థలు..
కై లాస్‌నగర్‌లో ఏళ్ల క్రితం ఇండోర్ స్టేడియం నిర్మించారు. ఆ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. ఇందులోనూ కేవలం బ్యాడ్మింటన్ ఆడేందుకు మాత్రమే వీలుండటంతో, ఇతర ఇండోర్ క్రీడలకు అవకాశం లేకుండా పోయింది. దీనికి తోడు స్టేడియంలో ప్రవేశ రుసుము చెల్లించాల్సి ఉండటంతో నిరుపేద క్రీడాకారులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. వీటిని పరిగణనలోకి తీసుకుని పాత స్టేడి యం ప్రాంగణంలోనే అధునాతన ఇండోర్ స్టేడి యం నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది.
పట్టణ ప్రగతి నిధులతో..
క్రీడాకారులకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హ యాంలో పట్టణ ప్రగతి నిధులతో నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ. కోటి 95 లక్షల అంచనా వ్య యంతో 2022లో మొదలైన ఈ పనులు పిల్లర్ల దశ వరకు వచ్చాయి. అయితే కాంట్రాక్టర్‌కు బిల్లులు విడుదల కాకపోవడంతో పనులు మధ్యలోనే నిలిచి పోయాయి. అప్పటి నుంచి అసంపూర్తిగానే ఉంది.
అందుబాటులోకి వస్తే..
ఈ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే ఎన్నో రకాల క్రీడలను ప్రోత్సహించే అవకాశం ఉంటుందని కోచ్‌లు చెబుతున్నారు. జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయి వేదికలపై సత్తా చాటి మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పోటీలను సైతం ఇక్కడ నిర్వహించుకోవచ్చు. దీనివల్ల క్రీడారంగం అభివృద్ధి చెందుతుందని, ప్రతిభావంతులైన క్రీడాకారులు వెలుగులోకి వస్తారని క్రీడా సంఘాలు అభిప్రాయ పడుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం..
ఇండోర్ స్టేడియం నిర్మాణం పట్టణ ప్రగతి నిధులతో ప్రారంభమైంది. పలు కారణాలతో పనులు నిలిచినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి పిప్రి సభకు వచ్చినప్పుడు క్రీడాభివృద్ధి కోసం రూ.6 కోట్లు ప్రతిపాదించడం జరిగింది. అవి విడుదలయితే పనులు వేగవంతం అవుతాయి.
– జక్కుల శ్రీనివాస్, డీవైఎస్‌వో
పనులు వేగవంతం చేయాలి
స్టేడియం నిర్మాణం త్వరగా పూర్తయి అందుబాటులోకి వస్తే ఎంతోమంది క్రీడాకారులకు లబ్ధి చేకూరుతుంది. అలాగే ప్రతిభావంతులైన నిరుపేద క్రీడాకారులు సైతం వెలుగులోనికి వస్తారు. ఈ మేరకు ప్రభుత్వం దృష్టి సారించాలి.
– నవీన్‌కుమార్, శాంతినగర్, ఆదిలాబాద్


