విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పలువురు గురువులు పోక్సో కేసులైనా మారని తీరు పక్షం వ్యవధిలోనే రెండో కేసు వెలుగులోకి రాని ఘటనలెన్నో.. తల్లిదండ్రుల్లో ఆందోళన
ఆదిలాబాద్‌టౌన్: విద్యాబుద్దులు నేర్పించాల్సిన గురువులే తప్పటడుగులు వేస్తున్నారు. వెకిలి చేష్టలతో కీచకులుగా మారుతున్నారు. కూతురు వయస్సు ఉన్న పిల్లలతో నీచంగా ప్రవర్తిస్తూ పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెస్తున్నారు. జిల్లాలో ఇటీవల వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పక్షం రోజుల క్రితం గుడిహత్నూర్ మండంలోని ఓ జెడ్పీఎస్‌ఎస్‌లో ఓ కీచక గురువు విద్యార్థినులను వేధించగా, శుక్రవారం జిల్లాలో మరో ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గురువుల లైంగిక వేధింపులను కొందరు విద్యార్థినులు తల్లిదండ్రుల వద్ద వెల్లబోసుకోగా, కొంత మంది ఎవరికి చెప్పుకోలేక మనోవేదనకు గురవుతున్నారు. మరోవైపు కలెక్టర్, పోలీసు శాఖ పోక్సో చట్టం, విద్యార్థులపై ప్రవర్తించాల్సిన విషయాలపై ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించినప్పటికీ తీరు మారకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. గడిచిన రెండేళ్లలో 10 మందికి పైగా ఉపాధ్యాయులపై పోక్సో కేసులు నమోదవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
మార్పు ఏదీ..?
జిల్లాలోని పలు ప్రభుత్వ, పైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న కొంత మంది కీచక గురువుల్లో మార్పు కానరావడం లేదు. కొంత కాలంగా పలువురు ఉపాధ్యాయులు విద్యార్థినులను మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. వారి తీరుపై విసుగుచెంది కొందరు పోలీసులు, షీ టీమ్‌ను ఆశ్రయిస్తే తప్పా ఘటనలు బయటపడటం లేదు. కొన్ని పాఠశాలల్లో ఇలాంటివి చోటు చేసుకున్నా బయటకు రాకుండా ఉపాధ్యాయులు కప్పిపుచ్చుతున్నారు. దీంతో సదరు ఉపాధ్యాయులపై చర్యలు లేకపోవడంతోనే వారి తీరులో మార్పు రావడం లేదని తెలుస్తోంది.
జిల్లాలో ఇటీవల సంఘటనలు..
అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు
విద్యార్థినులపై ఉపాధ్యాయులు అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా వేధింపులకు గురయితే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. షీటీమ్, డయల్ 100కు నిర్భయంగా సమాచారం అందించాలి. వివరాలు గోప్యంగా
ఉంచుతాం.– జీవన్‌రెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ


