‘ముందస్తు’పై ఆసక్తి! | - | Sakshi
Sakshi News home page

‘ముందస్తు’పై ఆసక్తి!

Apr 10 2026 9:57 AM | Updated on Apr 10 2026 9:57 AM

ఎర్లీ బర్డ్‌ పథకానికి మంచి స్పందన ఆస్తి పన్ను చెల్లిస్తే ఐదు శాతం రిబేట్‌ వసూళ్లకు ఆరు ప్రత్యేక బృందాలు ఈ నెల 30తో ముగుస్తున్న గడువు ఇప్పటివరకు 75శాతం చెల్లింపులు

కైలాస్‌నగర్‌: మున్సిపాలిటీల పరిఽధిలో ఆస్తిపన్ను బకాయిలు పేరుకుపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎర్లీబర్డ్‌ స్కీంను అమలు చేస్తోంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి గాను ముందస్తుగా పన్ను చెల్లించేవారికి ఐదు శాతం రాయితీ కల్పిస్తోంది. నివాస, నివాసేతర భవనాలకు సంబంధించి ఎలాంటి పాత బకాయిలు లేనివారినే ఇందుకు అర్హులుగా ప్రకటించింది. ఈ నెల 30వరకు పన్ను చెల్లింపునకు గడువు విధించింది. పలువురు యజమానులు మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి ప్రత్యేక కౌంటర్లలో పన్నులు చెల్లిస్తున్నారు. ఎర్లీబర్డ్‌పై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం కల్పిస్తే మరింత ఎక్కువగా పన్నులు వసూలయ్యే అవకాశముంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఆరు ప్రత్యేక బృందాల ద్వారా..

ఆదిలాబాద్‌ పట్టణంలో 49వార్డులున్నాయి. ఎర్లీబర్డ్‌ పథకం అమలులో భాగంగా నిర్దేశించిన పన్ను వసూళ్ల కోసం బల్దియా అధికారులు ఆరు ప్రత్యేక బృందాలను నియమించారు. ఒక్కో బృందంలో బిల్‌ కలెక్టర్‌, అసిస్టెంట్‌ బిల్‌ కలెక్టర్‌ లాంటి ఇద్దరు ఉద్యోగులను నియమించారు. బకాయిలు లేని యజమానుల వివరాలతో కూడిన జాబితాతో పాటు పీవోఎస్‌ మిషన్లను వారికి అందజేశారు. దీంతో వారు, ఉదయం సాయంత్రం వేళల్లో తమకు కేటాయించిన వార్డుల్లో ఇంటింటికీ తిరుగుతూ పన్నుల వసూళ్లకు ప్రయత్నిస్తున్నారు. ఏటా ఆస్తి పన్ను వసూళ్లలో ప్రభుత్వం వడ్డీ మాఫీ అమలు చేస్తూ వస్తోంది. పాత బకాయిలున్న వారికి వడ్డీపై 95శాతం రాయితీ కల్పిస్తోంది. అయితే గత 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంఽధించిన వన్‌టైం సెటిల్‌మెంట్‌ స్కీం బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని కేవలం జీహెచ్‌ఎంసీకే పరిమితం చేసింది. దీంతో పన్నుల వసూళ్లు గతేడాది కంటే కొంతమేర తగ్గాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎర్లీబర్డ్‌ స్కీంను అమలు చేస్తుందో లేదోననే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, దాన్ని ఈ సారి కూడా కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్‌ 1నుంచి 30వ తేదీ వరకు మున్సిపాలిటీలో ఈ స్కీం అమలుకు అవకాశం కల్పించింది.

గత మూడేళ్లలో ఇలా..

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో గత మూడేళ్ల ఎర్లీబర్డ్‌ ఆదాయాన్ని పరిశీలిస్తే రూ.2 కోట్ల వరకు వసూలవుతోంది. 2023–24లో ఈ స్కీం కింద రూ.1.83 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశారు. 2024–25లో రూ.2.13 కోట్లు రాబట్టారు. గత ఆర్థిక సంవత్సరం 2025–26కు గాను రూ.1.98 కోట్లు వసూలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గాను పన్నుల వసూళ్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందుకోసం మున్సిపల్‌ కార్యాలయంలో రెండు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. బిల్‌ కలెక్టర్లను పీవోఎస్‌ యంత్రాలతో అందుబాటులో ఉంచారు. ఎర్లీబర్డ్‌ స్కీం కింద పన్నుల వసూళ్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటివరకు రూ.12లక్షల మేర వసూలైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందుకు మరో 20 రోజులు గడువు ఉన్నందున ఈ విషయాన్ని తెలియజేసేలా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరముంది. ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, చెత్త బండ్ల ద్వారా అనౌన్స్‌మెంట్‌ చేయించడం లాంటి కార్యక్రమాలు చేపడితే మరింత ఎక్కువగా పన్నులు వసూలయ్యే అవకాశముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపపడితే బల్దియాకు ప్రయోజనం చేకూరనుంది.

Advertisement
 
Advertisement
Advertisement