నార్నూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని హౌసింగ్ డీఈ భగవంతరావు సూచించారు. గురువారం గాదిగూడ మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి పనులపై సమీక్షించారు. పనుల్లో వేగం పెంచాలని కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల మూడో వారం నుంచి నాలుగో వారం లోపు అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సామూహిక గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నందున, అందుకు అనుగుణంగా పనులు పూర్తి కావాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, ఎక్కడైనా నిర్లక్ష్యం తలెత్తితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, పనులు వేగవంతంగా కొనసాగించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమమని, ప్రతీ ఇల్లు నాణ్యమైనదిగా ఉండేలా అధికారులు, కాంట్రాక్టర్లు సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. హౌసింగ్ ఏఈ రాకేశ్, ఇందిరమ్మ గ్రామ కమిటీ సభ్యులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.


