కైలాస్‌నగర్: ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు లంక రాఘవులు ఆరోపించారు. 2005 ఉపాధిహామీ చట్టాన్నే కొనసాగించాలనే డిమాండ్‌తో గురువారం సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ‘కొత్త చట్టం వద్దు.. పాత చట్టమే కావాలి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ.. వీబీ జీ రామ్ చట్టం అమలు ద్వారా కూలీలకు కల్పించిన వేసవి అలవెన్స్, పే స్లిప్, తాగునీరు, పార, గుల్లలు, గడ్డపారలు లాంటి సౌకర్యాలు దూరం కానున్నాయని పేర్కొన్నారు. పైగా కొత్త చట్టంలో ఉదయం, మధ్యాహ్నం ఫొటోలు తీయటం, మేట్స్‌ను తొలగించడం, గ్రూపులను రద్దు చేయడం, నిధుల్లో కోత విధించడం లాంటి చర్యలతో చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రం స్పందించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, అడిషనల్ డీఆర్డీవో గజానన్‌రావుకు వినతిపత్రం ఇచ్చారు. నాయకులు స్వామి, గంగారాం, రామన్న, పోచ్చక్క తదితరులున్నారు.


