పాతాళంలోకి.. | - | Sakshi
Sakshi News home page

పాతాళంలోకి..

Apr 9 2026 7:59 AM | Updated on Apr 9 2026 7:59 AM

మండుతున్న వేసవి ఎండలు పడిపోతున్న భూగర్భ జలాలు ఫిబ్రవరి నుంచి మార్చి వరకు 1.76 మీటర్ల లోతులోకి..

సాక్షి,ఆదిలాబాద్‌: జిల్లాలో భూగర్భ జలాలు గణనీ యంగా పడిపోతున్నాయి. వేసవి ఎండలు మండిపోతుండడంతో పరిస్థితి తీవ్రరూపం దాల్చుతుంది.ఇచ్చోడలో 17మీటర్లు, గుడిహత్నూర్‌లో 15.30, భోరజ్‌లో 13.30, ఇంద్రవెల్లి మండలం ముత్నూర్‌లో 10.34, నేరడిగొండలో 9.50 మీటర్ల లోతులోకి జలాలు పడిపోయాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చి నీటి సమస్య ఏర్పడే పరిస్థితి ఉంది.

ఫీజో మీటర్ల ద్వారా అంచనా..

జిల్లాలో భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో 26 చోట్ల ఫీజో మీటర్ల ద్వారా భూగర్భ జలాలను నిర్ధారిస్తున్నారు. ప్రతినెలా చివరిలో వీటిని కొలిచి రిపోర్టు అందజేస్తారు. మార్చి చివరిలో కొలువగా, దానికి సంబంధించిన రిపోర్టును తాజాగా వెల్లడించారు. భూ ఉపరితలం నుంచి ఎంత లోతులో జలాల లభ్యత ఉందని ఇందులో స్పష్టం చేశారు. జిల్లాలో సగటున ఫిబ్రవరి నుంచి మార్చి వరకు మరింత లోతులోకి భూగర్భలాలు పడిపోయాయి. అప్పటివరకు ఉన్నదాని కంటే 1.76 మీటర్ల లోతులోకి జలాలు వెళ్లిపోయాయి. కొన్ని మండలాల్లో పరిస్థితి తీవ్ర రూపం దాల్చుతుంది.

ఇది నార్నూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఉన్న బావి. ఇటీవల వరకు నీళ్లు పైకి ఉండడంతో ఆస్పత్రిలోని వాట ర్‌ ప్లాంట్‌కు నీటి సమస్య ఏర్పడలేదు. ప్రస్తుతం బావి అడుగంటడంతో ప్లాంట్‌కు నీళ్లందని పరిస్థితి. దీంతో ఆసుపత్రి నిర్వహణకు ఇబ్బందుల తప్పట్లేదు.

రీచార్జ్‌ పద్ధతులు అవలంబించాలి

జిల్లా ప్రజలు రీచార్జ్‌ పద్ధతులను అవలంభించి నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇళ్ల సముదాయాల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల వద్ద చెక్‌డ్యాంలు, పాంపాడ్‌లు నిర్మించుకోవాలి. ఏప్రిల్‌, మే నెలల్లో సహజంగానే వేసవి తీవ్రత కారణంగా భూగర్భ జలాలు పడిపోతాయి.

– శ్రీవల్లి, జిల్లా భూగర్భజల శాఖ అధికారి

జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి..

నెల : లోతులో..

ఫిబ్రవరి : 5.29 మీటర్లు

మార్చి : 7.05 మీటర్లు

Advertisement
 
Advertisement
Advertisement