సోమగూడంలో భూ వివాదంపై ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

సోమగూడంలో భూ వివాదంపై ఉద్రిక్తత

Apr 8 2026 8:14 AM | Updated on Apr 8 2026 8:14 AM

కాసిపేట: బెల్లంపల్లి మండలంలోని సోమగూడం భరత్‌కాలనీ, ఆకెనపల్లి శివారులో సర్వే నంబర్‌ 3లో 2.30 ఎకరాల భూమి స్వాఽధీనానికి కోర్టు ఆదేశాలతో మంగళవారం జేసీబీతో వచ్చిన అధికారులను భూ బాధితులు, స్థానిక నాయకులు అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. దీంతో సోమగూడంలో ఉద్రిక్తత నెలకొంది. రాంకిష్టయ్య కుటుంబ సభ్యులు 2.30 ఎకరాల భూమి తమదని కోర్టును ఆశ్రయించారు. సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు రాంకిష్టయ్యకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇప్పటికే ఆ భూమిలో పలువురు అనధికారికంగా ప్లాట్లు చేసి నిర్మాణాలు చేపట్టారు. 13 ఇళ్ల నిర్మాణాలు ఉండగా మిగతా సగం ప్లాట్లుగా మారాయి. కోర్టు తీర్పు ప్రకారం 13 ఇళ్లను సైతం కూల్చివేసి మొత్తం భూమిని స్వాధీనపర్చుకోవాల్సిందిగా పేర్కొంది. గతంలో తీర్పుకు అనుకూలంగా కోర్టును ఆశ్రయించిన యజమానులకు పరిహారం ఇస్తామని బాధితులు తెలపడంతో తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇప్పటి వరకు పరిహారం ఇవ్వకపోవడంతో యజమానులు మరోసారి కోర్టును ఆశ్రయించగా కూల్చివేసేందుకు పోలీసు సిబ్బందితో యజమానులు జేసీబీతో అక్కడికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా స్థానికులు తరలివచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు రోడ్డు పైనే బైఠాయించారు. సాయంత్రం ఇరువర్గాల మధ్య కోర్టు సమీపంలో చర్చలు జరిపి కోటి రూపాయలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకోవడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ మౌనిక, కనకరాజు, ఉపసర్పంచ్‌ విజయ–భూమయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement