ఆదిలాబాద్: దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని ఎంపీ గోడం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. దేశ ప్రయోజనాలే పరమావధిగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలమైన శక్తిగా ఎదుగుతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభమైన బీజేపీ, నేడు కోట్లాది మంది కార్యకర్తలతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించడం గర్వకారణమని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు విజయ్, వేద వ్యాస్, జోగు రవి, రాజు, రాకేష్, సాయి, జీవన్, శ్రీకాంత్, నగేష్, సతీష్ పాల్గొన్నారు.


