కై లాస్‌నగర్: ఈ నెల 6న సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రారంభోత్సవాలు, శిలాఫలకాల ఆవిష్కరణ వద్ద ప్రొటోకాల్ విధిగా పాటించాలని, కేటాయించిన విభాగం వద్దనే ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉండాలని స్పష్టం చేశారు. మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ, ఇతర సర్టిఫికెట్ల అందజేత వంటి కార్యక్రమాలను నిర్ణీత సమయంలోగా, క్రమశిక్షణతో పూర్తి చేయాలని సూచించారు. వేదిక వద్ద తాగునీరు, సీటింగ్, పార్కింగ్, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. హెలీప్యాడ్ వద్ద, వీఐపీ గ్యాలరీలో భద్రతా ప్రమాణాలు పాటించాలని, అనుమతి ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని రెవెన్యూ, పోలీస్ అధికారులకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎస్.రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రాథోడ్ రవీందర్, వివిధ శాఖల ఈఈలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి
బజార్‌హత్నూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలని కలెక్టర్ రాజర్షిషా అన్నారు. మండలంలోని పిప్రి గ్రామంలో సీఎం సభ ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. అనంతరం దిగ్నూర్ ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. రికార్డులతో పాటు మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందుతుందా.. అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే గంగాపూర్, బోస్రా, దేగామ గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు మురళీధర్, సుభాష్, దేవుబాయి, కృష్ణకాంత్‌రెడ్డి, ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్, ఈఈ చంద్రమోహన్, డీఈఈ రమణ, ఏఈఈలు దివాకర్, వెంకటేశ్ గ్రామస్తులున్నారు.
‘మన ఇసుక వాహనం’ప్రారంభం
సాత్నాల: ప్రజలకు ఇసుక రవాణా సేవలను మరింత సులభతరం చేయడం, పారదర్శకత పెంపొందించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఇసుక వాహనం‘ వెబ్, మొబైల్ అప్లికేషన్‌ను కలెక్టర్ రాజర్షి షా శనివారం ప్రారంభించారు. భోరజ్ తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్ హెల్ప్ డెస్క్ ను సందర్శించి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, మైనింగ్ ఏడీ రవీందర్, తహసీల్దార్ రాజేశ్వరి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


