ఆదిలాబాద్‌టౌన్: ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ యు వకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన మహ్మద్ అర్బాజ్(25) ఎలక్ట్రీషియన్ పని చేస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన ఓ వివాహితతో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం గతంలోనే ఇంట్లో తెలియడంతో పలుసార్లు అర్బాజ్‌ను మహిళ కుటుంబీకులు, భర్త మందలించారు. గతంలో కత్తితో దాడి చేసేందుకు వెళ్లిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కాలనీలో అర్బాజ్‌పై కర్రతో దాడి చేశారు. స్థానికులు 108కు సమాచారం అందించారు. అప్పటికే అతడు మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ మార్చురీకి తరలించారు. ముగ్గురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తండ్రి మహ్మద్ ఆరీఫ్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వన్‌టౌన్ సీఐ సునిల్‌కుమార్‌ను సంప్రదించగా.. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు హిమతేజ
ఆదిలాబాద్: జిల్లాకు చెందిన యువ క్రికెటర్ కొడిమెల హిమతేజ మరో అరుదైన ఘనత సాధించాడు. బీసీసీఐ ఆధ్వర్యంలో బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ‘హై– పెర్ఫార్మెన్స్ క్యాంప్ ఫర్ ఎమర్జింగ్ అండర్–25’శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. ఆలిండియా సీనియర్ సెలక్షన్ కమిటీ ద్వారా హెచ్‌సీఏ నుంచి హిమతేజతోపాటు భువనగిరి పున్నయ్య అనే మరో క్రికెటర్‌ను ఎంపికై నట్లు బీసీసీఐ క్రికెట్ హెడ్ వీవీఎస్.లక్ష్మణ్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణ శిబిరం ఏప్రిల్ 13 నుంచి మే 7 వరకు జరగనుండగా, ఎంపికై న వారు ఏప్రిల్ 12లోపు బెంగళూరులో రిపోర్ట్ చేయాలని బోర్డు సూచించింది. శిబిరంలో యో–యో టెస్ట్, స్‌ప్రింట్స్, డెక్సా స్కాన్ వంటి కఠినమైన ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. హిమతేజను కోచ్ జయేంద్ర పటాస్కర్, పలువురు సీనియర్ క్రికెటర్లు అభినందించారు.
బైక్‌ను ఢీకొట్టిన లారీ: మహిళ మృతి
గుడిహత్నూర్: మండలంలోని జాతీయ రహదారి 44 సీతా గొంది సమీపంలో బైక్‌ను లారీ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఉట్నూర్ మండలం బీర్సాయిపేట్ చెందిన అప్పర్‌ఖాన్, రుమాన బేగం (43) దంపతులు. అనారోగ్యంతో బాధపడుతున్న రుమానా బేగంను జిల్లా కేంద్రంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు శనివారం బైక్‌పై బయల్దేరారు. చింతగూడ కార్నర్ వద్ద భారీ కంటెయినర్ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో రుమానా బేగం తలకు తీవ్రంగా, అప్పర్‌ఖాన్‌కు స్పల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో రిమ్స్‌కు తరలించగా అప్పటికే రుమానాబేగం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. కాగా, రెండురోజుల క్రితం జరిగిన ప్రమాదంలో సాద్వి కుమారి అశ్విని మృతి చెందింది. పోలీసులు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకర్లతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు ప్రయాణికులు, బాధితులు పేర్కొన్నారు.


