సీవోఈకి ఆదిలాబాద్ యువ క్రికెటర్ ఎంపిక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం మరో మెట్టెక్కిన మన ఆశాకిరణం
2019 సంవత్సరంలో అండర్–19 విభాగంలో ప్రతిష్టాత్మకమైన కూచ్ బెహార్ ట్రోఫీకి ఎంపికై సత్తా చాటాడు.
2022లో అండర్–25 విభాగంలో సీకే నాయుడు ట్రోఫీకి ప్రాతినిధ్యం వహించాడు.
2023లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తరఫున అండర్–23 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
2024లో నేషనల్ క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు.
2024–25 సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీకి, ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి ఎంపికయ్యాడు.
2025–26 సీజన్‌లో రంజీ ట్రోఫీలో మెరుగైన ప్రదర్శననిచ్చి సీవోఈకి ఎంపికయ్యాడు.
జిల్లాకు చెందిన ఈ యువ క్రికెటర్ తనదైన శైలిలో సత్తా చాటుతున్నాడు. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ఇప్పటికే జాతీయస్థాయి వేదికలపై మెరుస్తున్నాడు. సాధారణ కుటుంబ నేపథ్యమైనా అసామాన్య ప్రతిభతో లక్ష్యం దిశగా సాగుతున్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీలో సత్తా చాటిన జిల్లా కేంద్రానికి చెందిన కొడిమెల హిమతేజ తాజాగా బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో శిక్షణ శిబిరానికి ఎంపిక అయ్యాడు. రాష్ట్రం నుంచి ఇద్దరు ఎంపికవగా, అందులో ఇతడిని బ్యాటర్‌గా ఎంపిక చేస్తూ మాజీ ఇండియన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. – ఆదిలాబాద్
జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన మధుసూదన్–కామేశ్వరి దంపతుల కుమారుడు హిమతేజ. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా, తల్లి ప్రైవేట్ టీచర్‌గా పనిచేస్తున్నారు. చిన్ననాటి నుంచి హిమతేజ ఆసక్తిని గమనించి క్రికెట్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.
రంజీ ట్రోఫీలో ప్రతిభ ఆధారంగా సీవోఈకి ఎంపిక చేశారు. ఏప్రిల్ నుంచి మే వరకు ఈ శిక్షణ ఉండనుంది. ఇందులో మరిన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. తద్వారా ఆట తీరును మరింత నైపుణ్యవంతంగా ప్రదర్శించేలా ప్రయత్నిస్తాను. భవిష్యత్తులో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే లక్ష్యం. – హిమతేజ
సత్తా చాటుతున్నాడిలా..
జాతీయ జట్టుకు ఆడడమే లక్ష్యం..


